హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటంతో రాష్ట్రంలోని పలు అంగన్వాడీలకు అందాల్సిన గుడ్లు నెలలో సగం రోజులు మాత్రమే అందుతున్నాయి. దీంతో కేంద్రాలలో నమోదు చేసుకున్న బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్లు సైతం బహిరంగంగానే పెదవి విరిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సకాలంలో అంగన్వాడీలకు గుడ్లు సరఫరా చేయని కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఇచ్చిన నోటీసులకు వివరణ కూడా రావడం లేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు మాత్రం గుడ్ల సరఫరాలో లోపాలు లేవని వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో మంత్రి సీతక్క పలుమార్లు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే కాంట్రాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రతినెల గుడ్ల సరఫరాకు రూ.15 కోట్లు..
రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీలు ఉండగా.. వాటిలో ప్రతి నెలా సగటున 3 కోట్ల గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు ప్రతినెలా సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రతిఏటా బడ్జెట్లో కేవలం బాలింతలు, గర్భిణులు, పిల్లలకు దాదాపు రూ.180 కోట్లు కేటాయిస్తున్నారు. కానీ, అధికారులు, కాంట్రాక్టర్ల మాయాజాలంతో గుడ్ల పేరుతో నిధులు దారి మళ్లిస్తున్నట్లు కొందరు అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు నిర్మల డిమాండ్ చేస్తున్నారు.
సరఫరా చేసిన వాటికే బిల్లులు రాలేదు..
ఇదిలా ఉంటే టెండర్ల ప్రకారం రెండేండ్ల నుంచి గుడ్లు సరఫరా చేస్తున్నామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే 5 నెలలకు పైగా సరఫరా చేసిన గుడకు బిల్లులు రాలేదని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఏడాది గా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు. దీంతో వర్కర్లు, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి తమకు సకాలంలో బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.