సుల్తాన్‌బజార్, ఆగస్టు 28 : కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంతో గాంధీ దవాఖానలో ఆపరేషన్లు నిర్వహించలేని దుస్థితి నెలకొన్నది. దీనికి ప్రధాన కారణం అనస్థీషియా మందులు లేకపోవడమేనని తెలిసింది. దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులకు శుక్రవారం శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసి వారిని ఆపరేషన్ థియేటర్ వరకూ తీసుకెళ్లారు.
అయితే, థియేటర్లో అనస్థీషియా మందులు లేకపోవడంతో రోగులు, వారి సహాయకులను తిరిగి వెనక్కి పంపించి శస్త్రచికిత్సలు వాయిదా పడినట్టు వైద్యులు చెప్పారని రోగుల సహాయకులు తెలిపారు. చికిత్సలు జరుగకపోవడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దవాఖాన పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డీఎంఈగా ఉద్యోగోన్నతి పొందడంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉన్నది. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడం, ఉన్న ఇన్చార్జ్, ఇతర అధికారుల మధ్య సమన్వయ లోపంతో దవాఖానలో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నట్టు రోగులు ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత ఏర్పడిందని రోగులు విమర్శిస్తున్నారు. సంబంధిత మంత్రిత్వశాఖ నిర్లిప్తతతో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మందులు, సర్జికల్ వస్తువులు, అవసరమైన ఇంజెక్షన్లతోపాటు శస్త్ర చికిత్సల సమయంలో రోగులకు ఇచ్చే అనస్థీషియా మందుల కొరత కారణంగా శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటున్నారు. అవసరమైన మందులు లభించకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు.
గాంధీ దవాఖానలో శస్త్రచికిత్సలకు ఎలాంటి ఆటంకాలు కలుగలేదు. శుక్రవారం యథావిధిగా అన్నిరకాల అత్యవసర శస్త్రచికిత్సలు నిర్వహించాం. రాఖీ పండుగ, వరుస సెలవుల కారణంగా కొంత మ్యాన్‌పవర్ కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరం కాని కొన్ని సర్జరీలను వాయిదా వేసి ఉండవచ్చు. అనస్థీషియాకు సంబంధించిన మందుల కొరత లేదు.
-ఆవుల మురళీధర్, అనస్థీషియా విభాగాధిపతి, గాంధీ దవాఖాన