Telangana | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉన్నతాధికారుల అండదండలతో రాష్ట్రంలో కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో) చెలరేగిపోతున్నారు. సర్కారు ఉత్తర్వులకు పాతరేస్తున్నారు. బదిలీ చేసినా ఉత్తర్వులను ఖాతరు చేయడంలేదు. కుర్చీ వీడేందుకు ససేమీరా అంటున్నారు. పాత స్థానాల్లోనే తిష్ట వేస్తున్నారు. బదిలీ ఉత్తర్వులను రద్దుచేయించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తంగా డీఈవోల బదిలీల్లో విద్యాశాఖ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులు అభాసుపాలవుతున్నాయి. విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లానే ఇలాంటి విస్తుపోయే ఘటనలకు వేదికయ్యింది.
నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో జిల్లా డీఈవో మహ్మద్ అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేస్తున్నట్టు అదనపు కలెక్టర్ ప్రకటించారు. కానీ ఆ మరోసటి రోజే తొలుత ఆయనకు వనపర్తి జిల్లా డీఈవోగా పోస్టింగ్నిచ్చారు. నాగర్‌కర్నూల్, వనపర్తి రెండు జిల్లాలకు డీఈవోగా పనిచేస్తున్న గోవిందరాజులును బదిలీచేసి నారాయణపేట, గద్వాల రెండు జిల్లాల డీఈవోగా పోస్టింగ్నిచ్చారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు మారిపోయాయి. మహ్మద్ అబ్దుల్ ఘనీకి వనపర్తితో పాటు గద్వాల జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలప్పగించి, గోవిందరాజులును నారాయణపేట జిల్లాకు పరిమితం చేశారు. దీని వెనుక పెద్దఎత్తున లాబీయింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది.
మాగనూరులో మూడుసార్లు ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరిగినా ఇంకా నారాయణపేట డీఈవోగా అబ్దుల్ఘనీయే కొనసాగుతుండటం ఆందోళనకరమని స్థానికులు అంటున్నారు. ఇక గోవిందరాజులుపై గతంలో అనేక ఆరోపణలున్నాయి. ఓ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్సైన్స్)ను రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పోస్టులేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా అమ్మ ఆదర్శపాఠశాల కమిటీల సమన్వయకర్తగా నియమించారు. పాఠాలు చెప్పేందుకు టీచర్ లేకపోవడంతో సదరు ఫిజికల్ సైన్స్ టీచర్ పనిచేసే స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గోవిందరాజులు మహబూబ్‌నగర్ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. తాను బదిలీకాలేదని, నాగర్‌కర్నూల్‌లోనే ఉంటున్నట్టు కార్యాలయ వర్గాలతో చెప్పడం, వనపర్తి, నాగర్‌కర్నూల్ రెండు జిల్లాలకు డీఈవో బాధ్యతల నుంచి ఇంకా వైదొలగకపోవడం గమనార్హం.
డీఈవోల బదిలీల్లో భాగంగా జనగాం డీఈవో రామును బదిలీచేసి జగిత్యాల జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలప్పగించారు. జగిత్యాలలోని జగన్మోహన్రెడ్డిని రాజన్న సిరిసిల్లకు, సిరిసిల్లలో ఉన్న రమేశ్‌కుమార్‌ను నాగర్‌కర్నూల్‌కు బదిలీచేశారు. బదిలీ ఉత్తర్వులు విడుదలయ్యి రెండు రోజులు గడిచిపోయింది. మంగళవారం వరకు ఒక్క డీఈవో కదిలితే ఒట్టు. ఒక డీఈవో కదిలితేనే మరో డీఈవో పోస్టులో చేరే అవకాశముంది.
కానీ ఒక్కరు కూడా కదలకపోవడంతో ఇంతకు బదిలీ చేసినట్టా.. ? చేయనట్టా .. ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తంగా అధికారులిచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోవడం, ఉన్నతాధికారులిచ్చిన ఉత్తర్వులను జిల్లా స్థాయి అధికారులు ఖాతరు చేయకపోవడం విద్యాశాఖ పనితీరుకు అద్దంపడుతున్నది. అయితే జగిత్యాల డీఈవోగా నియమితులైన రాము తాను బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.