హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : షాక్ ట్రీట్మెంట్తో మొక్క పెరుగుతుందని ఐఐసీటీ పరిశోధకులు తేల్చారు. మొక్క వేరు, సూక్ష్మజీవులు కలిసి ఉండే రైజోస్పియర్ అనే ఆవరణలో లో ఓల్టేజీ కరెంట్‌ను సరఫరా చేయడం వలన మొక్క ఎదుగుదల ప్రభావితం అయినట్టు గుర్తించారు. కరెంట్ షాక్‌తో మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాల సరఫరా, కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరిగినట్టు, ఎదుగుదలకు అవసరమైన హార్మోన్లు, ఎంజైముల విడుదల ప్రభావితం అయినట్టు పేర్కొన్నారు. మొక్క పెరుగుదలలో విద్యుత్తు సరఫరా ప్రభావంపై ఐదేండ్లపాటు ఐఐసీటీ పరిశోధకులు చేసిన అధ్యయన ఫలితాన్ని ప్రముఖ సైన్స్ జర్నల్ బయోఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రచురించింది. మొక్క వేరుకు సమీపంలో ఉండే రైజోస్పియర్‌లో పలు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. మొక్క పెరుగుదల, పోషకాల సరఫరా, కిరణజన్య సంయోగక్రియను క్రమబద్ధీకరించడంలో సూక్ష్మజీవులు కీలకపాత్ర పోషిస్తుంటాయి. పెసర, శనగ మొక్కల రైజోస్పియర్ ఆవరణలో లో-ఓల్టేజీలో విద్యుత్తు సరఫరా చేయడం ద్వారా.. మొక్కలో జీవక్రియలు, ఎదుగుదలలో మార్పులు చోటుచేసుకున్నట్టు ఐఐసీటీ పరిశోధకులు ఎస్ వెంకటమోహన్, డీకే ఎరువా పేర్కొన్నారు.