హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రతకు, ము ఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన టీ-సేఫ్ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మకతకు ముందడుగు అని డీజీపీ బీ శివధర్‌రెడ్డి పేరొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్‌లో ‘మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చి ఆయ న.. టీ-సేఫ్ సాంకేతిక పరిజ్ఞానం, విశిష్టతను వివరించారు. శ్రామిక మహిళల ప్రయాణాన్ని అత్యంత సురక్షితం చేయాలనే లక్ష్యంతో టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు మహిళల భద్రత కోసం ఉన్న సౌకర్యాలు కేవలం అత్యవసర ప్రతిస్పందన కోసం మాత్రమే పనిచేస్తుండగా, టీ-సేఫ్ మాత్రం ప్రయాణం మొదలైనప్పటి నుంచే పర్యవేక్షణ ప్రారంభిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రమాదమని ప్రయాణికురాలు భావించి సమాచారం ఇస్తే.. అదే రూట్లో పోలీస్ పెట్రోల్ మోటర్ సైకిళ్లు బాధితురాలిని చేరుకుంటాయని తెలిపారు. ఈ సదుపాయానికి మహిళల నుంచి 4.7 రేటింగ్ లభించిందని గుర్తుచేశారు.