హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): త్రినయని టీవీ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యతో ఎన్నో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం మణికొండలోని సొంత ఫ్లాటులో ఉరేసుకోగా.. చందు వివాహ బంధంలో ఉన్న ట్విస్టులన్నీ బయటపడుతున్నాయి. చిన్ననాటి నుంచే శిల్ప అనే అమ్మాయి ప్రేమించి.. పెద్దల అంగీకారంతో 2015లో పెండ్లి చేసుకున్న చందు.. ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. కానీ, ఐదేండ్ల కిందట పరిచయమైన పవిత్ర జయరాం కోసం కన్నవారిని, కట్టుకున్న శిల్పను, అల్లారు ముద్దుగా పెరిగిన ఇద్దరు పిల్లలను (కొడుకు, కూతురు) వదిలేసి చివరకు తానే బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. ఏ పనిలేకుండా తిరుగుతున్న భర్త చందును గాడిలో పెట్టేందుకు శిల్ప చేయని ప్రయత్నమంటూ లేదని తెలిసింది. అతడితో ఐటీ కంపెనీ పెట్టించిందని సమాచారం. అయినా, సినిమా, సీరియళ్లలో చాన్స్ కోసం ప్రయత్నాలు చేశాడని, అనూహ్యంగా త్రినయని సీరియల్లో అవకాశం రావడం, ఐదేండ్ల కిందట పవిత్ర జయరాంతో ఏర్పడిన పరిచయం, సాన్నిహిత్యం.. ప్రేమ, పెండ్లి బంధాన్ని దూరం కూడా దూరం చేసిందని సన్నిహితులు చెప్తున్నారు. భార్యాపిల్లలను వదిలి మణికొండలో చందు-పవిత్ర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది. అదే ఫ్లాటులో చందు ఉరేసుకున్నాడు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారు వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా గత వారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ, తెలుగు కన్నడ నటి పవిత్ర జయరాం చనిపోయారు. పవిత్ర మరణం తర్వాత పూర్తిగా డిప్రెషన్లో పడిపోయిన చందు పూర్తిగా కోలేకపోయాడు. ఆమె చనిపోయిన తర్వాతనైనా భార్య, పిల్లలకు దగ్గర కాలేకపోయారు. పవిత్ర మనాదిలోనే ఉండిపోయాడు. పవిత్రమరణించిన నాటి నుంచి చందు ప్రతి రోజు ఆమె గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఆత్మహత్యకు ముందు ‘ఈ రోజు పవిత్ర బర్త్ డే, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. వెళ్దాం రా పవిత్ర’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు తెలిసింది. అదే సమయంలో సన్నిహితులతో వాట్సాప్‌లో చేసిన చాట్లోనూ తనకు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని, వెళ్లిపోవడమే కరెక్ట్.. అంటూ మెసేజ్ చేసినట్టుగా సమాచారం. అలాంటి పనులు చేయొద్దని వారించినా చందు వినిపించుకోలేదని, తనను పవిత్ర పిలుస్తున్నదని మెసేజ్‌లు పంపాడని తెలిసింది. ఒక్కసారి మామ అని పిలుస్తావా.. అంటూ ఇన్‌స్టాలో పంచుకున్నట్టుగా తెలిసిం ది. త్వరలోనే వీరి రిలేషన్ షిప్‌కు పెండ్లి కార్డు పడే సమయంలోనే ఈ ప్రమాదం జరగడం, అంతలోనే చందు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయినట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం భన్సీలాల్పేట్ శ్మశాన వాటికలో చందు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో చందు భార్య శిల్ప, పిల్లలు, తండ్రి వెంకటేశ్ పాల్గొన్నారు. మనవడితో కలిసి తండ్రి వెంకటేశ్ చితికి నిప్పంటించారు. చందు చివరి చూపు కోసం అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, తరలివచ్చారు.