హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ డివిజన్‌కు సంబంధించిన క్రూ లాబీ డిపో సహా అందులో పనిచేసే ఉద్యోగులను వరంగల్‌కు తరలించాలని తెలంగాణకు చెం దిన రైల్వే ఉద్యోగులు ఎప్పటినుంచో డి మాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని విశాఖపట్టణంలో కొత్త రైల్వేజోన్ ఏ ర్పాటు కావడంతో విజయవాడలోని క్రూ లాబీ డిపోలో(గాలా) పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన రెట్టింపయ్యింది. జోన్ విభజన నేపథ్యంలో విజయవాడ షెడ్లో పనిచేస్తున్న తెలంగాణ రైల్వే ఉ ద్యోగుల విభజన జరుగుతుందా? లేక ఏపీకి చెందిన రైల్వే ఉద్యోగులను మా త్రమే అక్కడ ఉంచుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనివల్ల దాదాపు 1,500మంది లోకో పైలె ట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు ఇబ్బందు లు పడుతున్నారు. వాస్తవానికి వరంగల్‌లో ఏర్పాటుచేయాల్సిన ఈ క్రూ షెడ్ ను నాటి పాలకులు విజయవాడలో ఏర్పాటుచేశారు. జోన్ విభజన ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. విజయవాడలోని క్రూ షెడ్ డిపోను వరంగల్‌కు తరలించకపోతే, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ఉద్యోగులంతా ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు. విజయవాడలోని క్రూ షెడ్ డిపోలో ఏపీ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యమిచ్చి, సికింద్రాబాద్ వారికి తక్కువ ప్రాధాన్యత కల్పించారనే ఆరోపణలున్నాయి. కానీ, ఉన్నతాధికారులు, ఎంపీలు లేదని మండిపడుతున్నారు.