హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరులో మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. పట్టణంలోని ఉమేశ్‌చంద్ర హాలు లో సచివాలయ మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కోసం పురుష టైలర్‌తో కొలతలు తీయించారు. అక్కడే కొందరు మహిళా పోలీసులు ఉన్నా, వారితో కొలతలు తీయించకుండా పురుష టైలర్ కొలతలు తీసుకోవడంతో మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీనిపై స్పందించిన నెల్లూరు ఎస్పీ, మహిళా పోలీసులకు సంబంధించి యూనిఫాం బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పజెప్పామని తెలిపారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్టు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిచేసినట్టు పేర్కొన్నారు. తెలిపారు. ఘటనపై మహిళా కమిషన్ ఆరా తీసింది. పురుష టైలర్‌తో మహిళా పోలీస్ యూనిఫాం కొలతలు తీసుకోవడంపై నెల్లూరు ఎస్పీతో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్టు వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.