నిర్మల్ అర్బన్, జనవరి 4 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ కాలనీకి చెందిన శక్కరి రమేశ్ అధికారుల వేధింపులు భరించలేక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. శక్కరి రమేశ్ ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనికి అన్ని అనుమతులు తీసుకున్నా మున్సిపల్ టీపీవో హరీశ్ తరచూగావచ్చి ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవంటూ పనులు అడ్డుకోసాగాడు. మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకున్నా అధికారులు పనులను అడ్డుకుంటున్నారని నిరసిస్తూ కార్యాలయం ఎదుట రమేశ్ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించాడు. అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి వెంటనే పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. కమిషర్ ఖమర్అహ్మద్, చైర్మన్ ఈశ్వర్ వచ్చి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.