Hyderabad | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని(Joint capital) బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా.సాకే శైలజానాథ్(Shailajanath) విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌ను (Hyderabad) ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరింపబడకుండానే శాశ్వత ముగింపు పడిందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ర్టానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన తెలియజేసారు. 10 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారిందన్నారు.
అపెక్స్ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నదని, దీనిపై కేంద్రం ఎటూ తేల్చకపోవటం పై శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా అన్నీ రాజకీయ పార్టీలు వాళ్ల ఎజెండా పక్కన పెట్టి కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకుని ఏపీ రాజధానిని నిర్మించుకునే వరకూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా 2014 పునర్విభజన చట్టాన్ని సవరించి కొనసాగించాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.