Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా అన్నట్టుగా పురపాలకశాఖ అనుమతుల పర్వంలో ఇదే నడుస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ మహా నగర పరిధిలో బహుళ అంతస్థుల అనుమతులపై సర్కారు దోబూచులాట అధికారులకు కాసుల పంట పండినట్టుగా తెలుస్తున్నది. ఓవైపు రియల్ ఎస్టేట్ కుదేలవుతున్నా… వచ్చిన దరఖాస్తుల నుంచి కాసులు వసూలు చేయాలని కొందరు పెద్దలు చూపిన ఉత్సాహం.. అవినీతి అధికారులకు మరింత ఊతమిచ్చినట్టయిందని విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో ఏడాదిపాటు అనుమతులు ఇవ్వకుండా వందల దస్ర్తాలను తొక్కిపెట్టారని అప్పట్లో మార్కెట్‌వర్గాలు పెద్దఎత్తున ఆవేదన వ్యక్తం చేశాయి. ఆ తర్వాత బెంగళూరు తరహా అనధికారిక ట్యాక్స్‌ను అమలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యనేతకు ప్రధాన అనుచరుల్లో ఒకరు షాడో మంత్రిగా వ్యవహరించి, ఆయన టిక్ పెడితేనే అనుమతులిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని సమాచారం. ఓ ఉన్నతాధికారి.. కూడా అదే బాటలో రెచ్చిపోయాడని తెలుస్తున్నది. వెరసి పెద్దల అవినీతి పుట్టలో కట్టల పాములు తయారయ్యాయి.
పేరుకున్న దస్ర్తాలు.. పేరుకే అధికారులు
అసలే అంతంత మాత్రంగా తయారైన హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్.. అనధికారిక ట్యాక్స్లతోనూ అల్లాడిపోతున్నదని మార్కెట్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రధానంగా నగర శివార్లు బహుళ అంతస్థుల నిర్మాణాలు భారీగా జరుగుతాయి. దీనికి తోడు మాస్టర్‌ప్లాన్-2031లో వివిధ రకాల ఇతర జోన్లలో నిర్ధారించిన భూముల్ని నివాస, వాణిజ్య భూవినియోగానికి మార్చుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి. వందల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఈ దస్ర్తాలతోనే ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఈ దస్ర్తాలేవీ ముందుకు కదల్లేదు. దీంతో వందలాది దస్ర్తాలు పేరుకుపోయి మార్కెట్‌వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. అనంతరం దరఖాస్తుదారులు అనుమతుల కోసం ‘ఉదయా’న్నే షాడో బాస్‌ను ప్రసన్నం చేసుకుంటే పనులు అవుతాయంటూ ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అనుమతుల ప్రక్రియ ముందుకు కదిలింది. అనధికారిక ట్యాక్స్ వేసి, అనుమతుల ప్రక్రియ కొనసాగించారని మార్కెట్ వర్గాల్లో ఆరోపణలు వచ్చాయి.
చెరువు భూములకూ సీఎల్‌యూ లు
బహుళ అంతస్థుల నిర్మాణ అనుమతుల్లో మొదలైన అవినీతిపర్వం భూవినియోగ మార్పిడి (సీఎల్‌యూ) దస్ర్తాలతో తారస్థాయికి చేరిందని అధికారులే చెప్తున్నారు. ఇక్కడే షాడో బాస్‌కు సమానంగా ఓ ఉన్నతాధికారి తూకం వేసినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటీవల పలు ప్రాంతాల్లో ఏకంగా చెరువు భూములను కూడా నివాసయోగ్య భూములుగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైడ్రా పేరుతో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో పేదల ఇండ్లు కూలుస్తున్న ప్రభుత్వం చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను సీఎల్‌యూ ఉత్తర్వులు ఇస్తున్నట్టుగా ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రచురించింది. కానీ యథారాజ.. తథాప్రజ! అన్నట్టు పెద్దలు ఆదిలో దండుకుంటే… సదరు ఉన్నతాధికారి దస్ర్తాలను ముందుకు కదిపే సమయంలో అందినకాడికి దండుకుంటున్నట్టు తెలిసింది. ఇలా హెచ్ఎండీఏ పరిధిలో సీఎల్‌యూ దస్ర్తాలకు ఈ మధ్యకాలంలోనే చాలా అనుమతులు ఇచ్చినట్టు సమాచారం.
ఆర్టీఐ చట్టం దరఖాస్తుల బుట్టదాఖలు
పదకొండు జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఏడాదిన్నర కాలంగా భూవినియోగ మార్పిడి అంశంలో పలు అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా నాలుగైదు నెలలుగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.
సీఎల్‌యూ అనుమతుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం-2015 కింద ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి దరఖాస్తు చేశారు. కానీ వివరాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ‘సీఎల్యూలకు సంబంధించి.. మీ దగ్గర ఉన్న జీవో నంబర్లను చెప్తే ఆ మేరకు సమాచారం ఇస్తాం’ అని బదులివ్వడం గమనార్హం. హెచ్ఎండీఏ సీఎల్యూలకు సంబంధించి ఎన్ని అనుమతులు ఇచ్చిందనే వివరాలు ఇవ్వాలని కోరడమంటేనే.. ఏ ప్రాంతంలో, ఏ సర్వేనంబర్‌లో ఎంత విస్తీర్ణంలో భూవినియోగ మార్పిడికి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిందనే సమాచారం కావాలని దరఖాస్తు సారాంశం. కానీ జీవో నంబర్లు పేర్కొనాలంటే.. ఆ సమాచారమే ఉంటే ఇక దరఖాస్తు ఎందుకు చేయాల్సి వస్తుందో అధికారులే చెప్పాలి. మొత్తంగా సీఎల్యూల గుట్టు రట్టవుతుందనే భయంతోనే చివరకు సమాచారహక్కు చట్టాన్ని కూడా హెచ్ఎండీఏ అధికారులు ఖాతరు చేయడం లేదు.