మణికొండ, జూన్ 8: గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల (సీబీఐటీ)లో లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నాయని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఐక్యూసీ డైరెక్టర్లు సుశాంత్‌బాబు, త్రివిక్రమరావు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ నరసింహకు ఫిర్యాదు చేసినా.. తేలికగా తీసుకున్నారని పేర్కొన్నారు. శనివారం తనను లైంగికంగా వేధించారని మహిళా ప్రొఫెసర్ రోదించారు. విషయం తెలుసుకున్న ఇతర మహిళా ప్రొఫెసర్లు బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి ప్రిన్సిపాల్ చాంబర్ ముందు బైఠాయించారు.
మహిళా సిబ్బందిని వేధిస్తున్న వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని బోధనేతర సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ డిమాండ్ చేశారు. అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సుశాంత్‌బాబు, త్రివిక్రమ్‌రావు, ఇంగ్లిష్ హెచ్‌వోడీ గుప్తా ప్రవీణ్‌ను విధుల నుంచి తొలగించాలన్నారు. కామాంధులపై చట్టపరమైన చర్యలు తీసుకొనేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీబీఐటీలో లైంగిక వేధింపులపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నార్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.