HomeTelanganaSexual Assault On Woman In Nizamabad District Centre
మహిళపై సామూహిక లైంగిక దాడి
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి షాపింగ్‌కు వచ్చిన ఓ మహిళపై నలుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమ ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాధితురాలిని కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన
ఆటోడ్రైవర్ నమ్మించి అఘాయిత్యం
పోలీసుల అదుపులో నిందితులు
వినాయక్‌నగర్, అక్టోబర్ 19: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి షాపింగ్‌కు వచ్చిన ఓ మహిళపై నలుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమ ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాధితురాలిని కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. బోధన్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం షాపింగ్ కోసమని నిజామాబాద్‌కు వచ్చింది.
షాపింగ్ ముగించుకుని బస్టాండ్‌కు చేరే సరికి రాత్రి 11 గంటలైంది. ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో అక్కడ ఉన్న ఓ ఆటోను ఆశ్రయించగా అతను సరేనన్నాడు. అప్పటికే ఆటోలో మగవాళ్లు ఉండటంతో వారు ప్రయాణికులే అనుకుంది. ఆమె ఆటో ఎక్కగానే సదరు ఆటోడ్రైవర్ బోధన్ వైపు కాకుండా డిచ్పల్లి వైపు తీసుకెళ్లాడు.
గమనించిన మహిళ ఇటు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా, పక్కన కూర్చున్న వారు అరిస్తే చంపుతామంటూ భయపెట్టారు. డిచ్పల్లి-రాంపూర్ మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి నలుగురు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిజామాబాద్ బస్టాండ్ వద్ద దింపేసి వెళ్లిపోయారు.
బాధితురాలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్‌హెచ్‌వో రఘుపతి కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని వైద్యం కోసం జీజీహెచ్‌కు తరలించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.