హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉన్నది రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీరు. ఇప్పటికే ఉన్న ఆయకట్టుకు అపసోపాలు పడుతున్న జూరాల ప్రాజెక్టుపై కొడంగల్ లిఫ్ట్ పేరిట మరో భారాన్ని మోపుతున్నది. భీమా పథకంలో ప్రతిపాదిత ఆయకట్టు మొత్తానికి ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీరు ఇవ్వకున్నా కూడా పొదుపు పేరిట జలాల్లో కోత విధించడం కొసమెరుపు. మరోవైపు రాజీవ్‌భీమా ఆయకట్టు కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ట్రిబ్యునల్ ఎదుట కొట్లాడి నికర జలాలను సాధించాల్సింది పోయి, సొంత నియోజకవర్గం కోసం వేరొక ప్రాజెక్టులోని నికరజలాల్లోనే కోత విధించే దుర్మార్గానికి సర్కారు తెగబడింది.
జూరాల ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ 17.84 టీఎంసీలను కేటాయించింది. ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చే సమయానికే దాని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుత లైవ్ కెపాసిటీ 6.8 టీఎంసీలు మాత్రమే. వాస్తవాలు తెలిసినా.. తక్కువగా నీటినిల్వ ఉన్న చోటు నుంచి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండబోదని నెత్తినోరు బాదుకుంటున్నా ఉమ్మడి రాష్ట్ర ఏలికలు కుట్రపూరితంగా, కృష్ణాజలాలు తెలంగాణకు దక్కకుండా చేసేందుకు జూరాల ప్రాజెక్టును ఆధారంగా చేసుకునే అనేక ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు. రాజీవ్‌భీమా స్టేజ్ 1, స్టేజ్ 2, కోయిల్‌సాగర్, జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచే చేపట్టారు. మొత్తంగా ఒక్క జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి ఇప్పటికే 5.48లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకే యాసంగిలో నీరందించలేని దుస్థితి. కేవలం ఒకే పంటకే నీరందిస్తున్నారు.
కృష్ణా డెల్టాకు ట్రిబ్యునల్ -1 దాదాపు 183 టీఎంసీలను చారిత్రక రక్షణల కింద కేటాయించింది. డెల్టా కాల్వల ఆధునికీకరణ వల్ల 29 టీఎంసీల మేరకు మిగులు ఏర్పడుతున్నదని చెప్పి అందులో 9 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రాజెక్టు కింద ఒక టీఎంసీకి 10వేల ఎకరాలకు నీరందించేలా మొత్తంగా 2.03 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించారు. జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ భీమా ప్రాజెక్టును ప్రారంభించినా రాష్ట్ర ఏర్పాటు నాటికి పనులేమీ పూర్తికాలేదు. కేసీఆర్ హయాంలో పూర్తయ్యాయి. భీమా ఆయకట్టు రైతులకు చెందాల్సిన 7.33 టీఎంసీల జలాల్లో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేటాయించడం గమనార్హం.
రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకాన్ని రెండు స్జేజ్లుగా చేపట్టారు. జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌పై రామన్‌పాడు వద్ద పంచదేవపాడు గ్రామం వద్ద ఒకటి, ఊకచెట్టి వాగు ప్రాజెక్టుపై 2వ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా దీర్ఘకాలికంగా కరువు పీడిత మక్తల్, మాగనూరు, ఆత్మకూర్, నర్వ, చింతకుంట, దేవరకద్ర, కొత్తకోట, పెద్దమందడి, మహబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బబైర్, పాన్‌గల్, వీపనగండ్ల, కోడేరు, కొల్లాపూర్ మండలాల్లోని తదితర మెట్ట ప్రాంతాల్లోని మొత్తం 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ప్రస్తుతం 1.58లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇంకా 40వేల ఎకరాలకుపైగా నీరందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే భీమా ప్రాజెక్టు మొత్తంలో నీటినిల్వకు భూత్పూర్, సంగంబండ, రంగసముద్రం, శంకరసముద్రం రిజర్వాయర్లు ఉండగా, వాటి మొత్తం నిల్వసామర్థ్యం 8.3టీఎంసీలే. భీమా స్కీమ్‌లో ప్రధానమైన, మొదటిదయిన భూత్పూర్ రిజర్వాయర్ (1.3టీఎంసీలు) నుంచే ప్రస్తుతం నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ రిజర్వాయర్ నుంచే 7టీఎంసీల జలాలను తరలించాలే ప్రణాళికలను రూపొందించారు.
ఉమ్మడి పాలకుల వివక్ష మూలాన కోల్పోయిన నీళ్లను ఒడిసిపట్టేందుకు స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రాజెక్టుల రీఇంజినీరింగు చేపట్టారు. కృష్ణాబేసిన్‌లో చాలా వరకూ అన్ని లిఫ్టు సీంలు కావడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఎకువగా ఉంచుకోవాల్సిన అవసరం మరింతగా ఉందని చెప్పడమే కాదు.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లలో సాధ్యమైనంత నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుతూ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. జూరాలపై ఉన్న భారాన్ని గుర్తించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంటేక్ పాయింట్‌ను ఏడాది పొడవునా నీటినిల్వలు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు మార్చారు. ఇక పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 67.97టీఎంసీలు పెట్టారు. ప్రస్తుత రేవంత్సర్కారుకు ఆ సోయి లేకుండా జూరాలపైనే మరో ప్రాజెక్టును చేపట్టడం గమనార్హం. దీనిపై సాగునీటిరంగ నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.