హనుమకొండ, మే 10: టీజీ ట్రాన్స్‌కోలో ప్రమోషన్ల వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఉద్యోగుల్లో ఆవేదన నెలకొన్నది. ట్రాన్స్‌కో పరిథిలో ఇంజినీర్లు, జేఏవోలు, జేపీవోలకు వరుసగా ప్రమోషన్లు కల్పిస్తున్న యాజమాన్యం, ఫీల్డ్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న జేఎల్‌ఎంలను మాత్రం విస్మరిస్తున్నదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రాన్స్‌కోలో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అంతరాయం కలుగకుండా పనిచేసే ఓ అండ్ ఎం సిబ్బందే కీలకమని ఉద్యోగులు పేరొంటున్నారు. రాత్రింబవళ్లు, ఎండా, వానా తేడా లేకుండా ఫీల్డ్‌లో 24 గంటలు పనిచేసే వీరికి ప్రమోషన్ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నామని జేఎల్ఎంలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ జోన్ పరిధిలో 53 ఏఎల్ఎం పోస్టులున్నట్టు సమాచారం. గత 15 నుంచి 20 ఏండ్లుగా పని చేస్తున్న సిబ్బందికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో 11 సర్కిళ్ల పరిథిలో 350 పైచిలుకు ఏఎల్ఎం పోస్టులున్నప్పటికీ ప్రమోషన్లు కల్పించకపోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో యాజమాన్యం వెంటనే ప్రమోషన్ల ప్రకియ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా..
ట్రాన్స్‌కో పరిథిలో ఇంజినీర్లు, జేఏవోలు, జేపీవోలకు ప్రమోషన్లు ఇచ్చిన యాజమాన్యం జేఎల్ఎంలకు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే జేఎల్‌ఎంల ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అధికారులకు ఇన్చార్జి ప్రమోషన్లు సులభంగా కల్పిస్తున్న యాజమాన్యం ఇంజినీరింగ్ క్యాడర్, ఇతర సెక్షన్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవకాశాలు కల్పిస్తూ ఓ అండ్ ఎం ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి నిబంధనల పేరుతో అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
రెండేండ్లుగా ఎదురు చూపులు
తెలంగాణ ట్రాన్స్‌కోలో ఓ అండ్ ఎం సిబ్బంది ప్రమోషన్ల కోసం రెండేండ్లుగా ఎదురు చూస్తున్నారు. టీజీ ఎన్పీడీఎల్లో ప్రమోషన్లు కల్పించినా ట్రాన్స్‌కోలో మాత్రం వివిధ కారణాలు చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జేఎల్‌ఎంలుగా పనిచేస్తున్న వారిలో చాలామంది తొలుత కాంట్రాక్ట్ లేదా ఆర్టిజన్ ఉద్యోగులుగా 15 నుంచి 20 సంవత్సరాల పాటు సేవలందించిన వారేనని పేర్కొన్నారు. ఆ అనుభవాన్ని, సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రెగ్యులర్ సర్వీస్ తకువగా ఉందనే కారణంతో ప్రమోషన్లు నిలిపివేయడం అన్యాయమని జేఎల్ఎంలు వాపోతున్నారు.
ట్రాన్స్‌కో పరిధిలో విద్యుత్ వ్యవస్థలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి పరిషరించే బాధ్యత ఓ అండ్ ఎం సిబ్బందిపైనే ఉంటుందని, ప్రమాదాలను సైతం లెకచేయకుండా విధులు నిర్వర్తించే ఉద్యోగుల కష్టానికి తగిన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా టీజీ ట్రాన్స్‌కో యాజమాన్యం స్పందించి ఓ అండ్ ఎం సిబ్బందికి న్యాయం చేయాలని, జేఎల్ఎంలకు తక్షణ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంలో టీజీ ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్డీ) వీ శ్రీనివాసులును ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.