హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): మహిళా అధికారిపై మీడియాలో వస్తున్న కథనాలను రాష్ట్రంలోని పలు ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. సదరు మీడియా సంస్థలు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. వ్యక్తిత్వ హననం.. పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేయడం అత్యంత దురదృష్టకరమని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
సంచలనం కోసం మహిళా అధికారిపై అసత్య ప్రచారం చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. మహిళా ఐఏఎస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న ఆధారరహితమైన, అసత్య కథనాలు సరికావని తెలిపారు.
మహిళా అధికారులపై అనుచిత ప్రసారాలు సరికాదని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ, రెవెన్యూ జేఏసీ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయవద్దని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాథోడ్ రమేశ్, జనరల్ సెక్రటరీ కే రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే నిరసనలు చేపడుతామని పలు సంఘాలు హెచ్చరించాయి.