BRS | హైదరాబాద్/సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి వేళ పోలీసుల బూట్ల చప్పుళ్లు.. చడీచప్పుడు కాకుండా తలుపుతట్టి.. తలుపు తీసి తీయకముందే ఎత్తుకెళ్లిపోవడం.. సర్కిల్ సాబ్ తీస్కరమ్మన్నడు… ఇంటి నుంచి కదలొద్దని ఆర్డర్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లారేవరకు తెలంగాణ అంతటా ఇవే ఫత్వాలు… బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే కాదు.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు..మాజీ మంత్రులు అన్న తేడాలేమీలేవు. ఎక్కడివాళ్లక్కడ.. ఎవరింట్లో వాళ్లను కాలు తీసి కాలుపెట్టడానికి వీలు లేదన్నట్టే పోలీసులు వ్యవహించారు. మొత్తంగా తెలంగాణ హౌజ్ అరెస్ట్. దవాఖానకు పోవుడు లేదు.. మందుగోలీలు తెచ్చుకునుడు లేదు. అటున్న మనిషి ఇటు రావొద్దు..ఇటున్న మనిషి అటుపోవద్దు.. ఇదీ బీఆర్ఎస్పై పోలీసులు వ్యవహరించిన తీరు. గురువారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరగణం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిమీద దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ఎక్కడిక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు నిర్భందించారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంట్లో ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు సమావేశమై అక్కడి నుంచి తాను పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి సమావేశం అవుదామని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గురువారం ప్రకటించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేశారు.
ఎవరూ బయటకు రావొద్దు
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గురువారం రాత్రి డీజీపీ నగరంలోని ట్రై పోలీస్‌కమిషనర్లతో మాట్లాడినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితులలోను బీఆర్ఎస్ శ్రేణులు ఇండ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా కమిషనర్ డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలకు ఆ ఆదేశాలు పంపించారు. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే పోలీసులు బీఆర్ఎస్ నాయకులు గృహ నిర్భందాలు మొదలు పెట్టారు. శుక్రవారం వినాయక బందోబస్తులు, నిమజ్జన ఏర్పాట్లను పక్కన పెట్టి మరీ బీఆర్ఎస్ నాయకులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా చూడడమే విధిగా పోలీసులు పని చేశారు.
దవాఖానకూ వెళ్లనీయం
గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేస్తుండగా పెనుగులాటలో ఆయన ఎడమ భుజం ఒత్తిడికి గురైంది. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ఆయనను పరామర్శించేందుకు కోకాపేటలోని హరీశ్ ఇంటికి వెళ్లారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హరీశ్ఇంటికి వెళ్లగా పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో వారు అక్కడిక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటికి హరీశ్‌రావు తాను దవాఖానకు వెళ్లాలని ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ‘మిమ్మల్ని హౌజ్ అరెస్టు చేశాం.. ఎక్కడికి వెళ్లనీయం’ అని చెప్పారు. అవసరం అయితే ‘మీరూ రండి.. హాస్పిటల్‌కు పోయి వస్తాం’ అని హరీశ్ నచ్చజెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్నూ మారేడ్‌పల్లి పోలీసులు ఇదే రీతిలో నిర్భంధం చేశారు. తన హెల్త్ బాగోలేదని, డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నదని చెప్పినా పోలీసులు వినలేదు. కారు ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంట్లోనే ఉండిపోయారు.శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బ తింటుందని మాజీ మంత్రి తలసానిశ్రీనివాస్యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతల ఇండ్ల వద్ద సెక్షన్ 144
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ హైదరాబాద్ బయలుదేరేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. తెలంగాణవాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు మొదలయ్యాయి. రాష్ట్రంలోని గ్రామస్థాయిలో సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండే కార్యకర్తల నుంచి మండల, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి నేతల వరకూ అరెస్టులు కొనసాగాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేస్తూ.. వారి ఇండ్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అనధికారిక నిర్బంధాలను నిరసిస్తూ.. కొందరు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీంతో వారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పథకం ప్రకారం అర్ధరాత్రిళ్లు అరెస్టు చేయడంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. అయితే కొందరి తమ పోలీసు వాహనాల్లో తిప్పుతూ.. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. దీంతో పోలీసులు తమను ఏం చేస్తారోననే ఆందోళన బీఆర్ఎస్ కార్యకర్తల్లో నెలకొన్నది.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇల్లు అష్టదిగ్బంధం
మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి వద్ద గురువారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి, అష్టదిగ్భంధం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి వేలాదిమంది కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడీ గాంధీ ఇంటికి వెళ్లి సత్కరిస్తామని పేర్కొన్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గురువారం రాత్రే శంభీపూర్‌లోని ఎమ్మెల్సీ రాజు ఇంటికి చేరకున్నాడు. పోలీసులను ఛేదించుకుని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. శంభీపూర్ రాజు నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలనూ అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్సీ నివాసానికి చేరుకుని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం 6గంటల వరకు నేతలను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని ఇంటికివెళ్లేందుకు అనుమతించడంతో ఆయనతోపాటు ఎమ్మెల్సీ రాజు వెళ్లిపోయారు.
ధర్నాలు.. నిరసనలు
ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మదర్ థెరిస్సా సెంటర్లో ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జిపై నిరసనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న గోదావరిఖని పోలీసులు వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అడుగడుగునా నిర్బంధాలు
శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కండువాయే కాదు చివరికి గులాబీ రంగు కనిపిస్తే చాలు అరెస్ట్ చేసి లోపల వేస్తాం అన్నట్టు పోలీసులు వ్యవహరించారు. అడుగడుగునా నిర్బంధాలు, అరెస్టులతో తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేశారు.
15 రోజుల పాటు ఫిజియోథెరపీ
హరీశ్‌రావుకు నొప్పి తీవ్రత పెరగటంతో పోలీసు వాహనాల నడుమ ఆయన శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నారు. భుజానికి దెబ్బతగిలినందున 15 రోజులపాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించినట్టుగా హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. 15 రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు చెప్పారని తెలిపారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రాజధాని దారులన్నీ జల్లెడ
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లే దారులను పోలీసులు జల్లెడ పట్టారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో గట్టినిఘాను పెంచారు. బస్సుల్లో.. రైళ్లల్లో ప్రయాణీకులను ‘ఎక్కడికి వెళుతున్నారు?’ అని అడిగి అనుమానం వచ్చినవారిని అదుపులోకి తీసుకొని సాయంత్రం విడిచిపెట్టారు. మరోవైపు హైదరాబాద్ ఇమ్లీబన్, జేబీఎస్ సహా సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లుపై ప్రత్యేక నిఘాను మోహరించారు. హైదరాబాద్ నలువైపులా ఉన్న టోల్గేట్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
నిన్న బీఆర్ఎస్లో అంతర్గత గొడవగా చెప్పిండ్రు. నేడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటున్నరు. కౌశిక్ ఇంటికి హరీశ్, సొంతపార్టీ నేతలు వెళ్తే తప్పు! గాంధీ ఇంటికి దానం, బొంతు వెళ్తే ఒప్పు! దాన్నెవరూ ఆపరు! అదేందని అడగరు!వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ ఇంటికాడ గుమికూడొచ్చు. కానీ, బీఆర్ఎస్ నాయకులు తమ ఇంటి గడప దాటకూడదు!కాంగ్రెసోళ్లు కాన్వాయ్ వేసుకుని ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి రావొచ్చు! హరీశ్, తలసాని వంటి నేతలను కనీసం దవాఖానకైనా వెళ్లనివ్వరు!బీఆర్ఎస్ అని చెప్పుకునే గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు రావొచ్చు. ‘టిఫిన్ చేస్తందుకే వచ్చినం’ అంటూ వెటకారమాడొచ్చు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చెప్పుకునే అదే గాంధీ ఇంటికి..బీఆర్ఎస్ నేతలు రాకూడదు. వస్తే అరెస్టులు.. అక్రమ కేసులు!బీఆర్ఎస్ నేతల ఆందోళన శాంతి భద్రతల సమస్య!కాంగ్రెస్ నేతలు చేస్తే.. అది రాజకీయ ప్రతిస్పందన!ఇదీ రేవంత్ సర్కారు ద్వంద్వనీతి!ప్రజాస్వామిక విలువలకు పట్టిన దుర్గతి!!
రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులను గుర్తుకు తెచ్చాయి. సమైక్య నేతల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ సమాజం హెచ్చరికలు జారీ చేసినప్పుడు.. నెలకొన్న పరిస్థితులే తిరిగి కండ్ల ముందు కదలాడాయి. గురువారం నాటి హైటెన్షన్ ప్రతిఘటనతో వెనక్కితగ్గినట్టు కనిపించిన పోలీసులు.. ఏ ఒత్తిళ్లు పనిచేశాయోగానీ అర్ధరాత్రి నుంచే మళ్లీ అరెస్టులకు దిగారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను గృహనిర్బంధం చేశారు. పార్టీ ఆఫీసులచుట్టూ బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మొదలుకొని సాధారణ కార్యకర్తల వరకూ ఎవరినీ పోలీసులు వదల్లేదు. దవాఖానకు వెళ్తామన్న విడిచిపెట్టలేదు. గులాబీ శ్రేణులపై నిర్బంధాన్ని ప్రయోగించిన పోలీసులే.. అధికార పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అరెకపూడి ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్తేఎస్కార్ట్ ఇచ్చి మరీ రక్షణ కల్పించారు.
కాంగ్రెస్ గుండాలతో దాడులు
మా అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వకున్నా భయపడి బీఆర్ఎస్ శ్రేణులను ప్రభుత్వం అరెస్ట్‌లు చేయిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ గుండాలతో రేవంత్‌రెడ్డి ప్రభు త్వం దాడులు చేయిస్తున్నది. కాంగ్రెస్ వచ్చిన 9 నెలల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.
-జోగు రామన్న, మాజీమంత్రి
సీఎం ప్రోత్సాహంతోనే దాడులు
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడుల పాలనగా మారింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది. హరీశ్‌రావుకు మద్దతు తెలిపేందుకు పోతున్న తనను, బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం.
-అనిల్‌జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
నాయకుడి పేరు జిల్లా (నిర్బంధ ప్రాంతం)