హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ) : ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ వేడుకలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, గిరిజన ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది గిరిజనులకు సేవాలాల్ మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నాయకులు రామచంద్రు నాయక్, వాద్యా నాయక్, సంజీవ్ నాయక్, శ్రీనివాస్, రవితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. సేవాలాల్ పుట్టి పెరిగిన మహారాష్ట్రలో కూడా ఆయన జయంతిని సర్కారు అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. కేసీఆర్ హయాంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం మొదలైందని గుర్తుచేశారు.
గిరిజనులకు హైదరాబాద్ నడిబొడ్డున రూ.25 కోట్లతో సేవాలాల్ మహారాజ్ భవన్‌ను కేసీఆర్ కట్టించారని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. నేడు కాంగ్రెస్ పాలనలో గిరిజనులు అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు కాంగ్రెస్ మాయమాటలు చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. పెద్దసంఖ్యలో గిరిజన గురుకులాలను కేసీఆర్ ఏర్పాటు చేస్తే.. నేడు కాంగ్రెస్ సర్కారు వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీస్ సాలర్షిప్లు కూడా ఇవ్వడం లేదని, 14 నెలలుగా 14 పైసలు కూడా విడుదల చేయలేదని, విదేశాల నుంచి గిరిజన విద్యార్థులు చదువు మధ్యలోనే వదిలేసి తిరిగి వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన సంక్షేమశాఖ సీఎం దగ్గరే ఉన్నదని, ఆ మంత్రిత్వశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్‌లో గిరిజనులెవ్వరూ లేరా? అని ప్రశ్నించారు. గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కూడా ఖర్చు కావడం లేదని మండిపడ్డారు. గిరిజన బిడ్డలు కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు మధ్య తేడా గమనించాలని సూచించారు. కేసీఆర్ పాలన వస్తేనే గిరిజనులకు మేలు జరుగుతుందని చెప్పారు.
గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 55 నుంచి 60 నియోజకవర్గాల్లో లంబాడాల సంఖ్య గణనీయంగా ఉన్నదని చెప్పారు. గిరిజన గురుకులాల్లో రేవంత్ ప్రభుత్వం విద్యార్థులకు ఆహారం కూడా సక్రమంగా పెట్టడం లేదని మండిపడ్డారు. గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటున్నదని విమర్శించారు. గిరిజన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా అయినా కల్యాణలక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగే సేవాలాల్ జయంతి కార్యక్రమానికి గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు.