హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న అనేక పరిశ్రమలకు బొగ్గునందిస్తున్న సింగరేణి సంస్థ(Singareni Coal ) తన వినియోగదారుల పట్ల స్నేహపూరితంగా వ్యవహరిస్తుందని సింగరేణి సంస్థ చైర్మన్ (Chairman ) , ఎండీ ఎన్. బలరామ్ (Balaram) పేర్కొన్నారు. వారిని వినియోగదారులుగా కాకుండా ప్రగతి భాగస్వాములుగా గుర్తిస్తోందని, వారి సౌకర్యం కోసం ఒక ప్రత్యేక సమన్వయ సెల్ (Special cell) ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ-వేలం వినియోగదారులు, వ్యాపారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సమాచార లోపం లేకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. దేశంలోని ఏ ఇతర బొగ్గు సంస్థల్లో లేనివిధంగా సింగరేణిలో ఈ-వేలం వినియోగదారులకు అనేక వెసులుబాట్లను కల్పించామన్నారు.
కోల్ ఇండియాలో ఈ-వేలం సేల్ ఆర్డర్ కాలపరిమితి కేవలం 45 రోజులు ఉండగా సింగరేణిలో ఇది 90 రోజులుగా ఉందని పేర్కొన్నారు. ఎవరైనా వినియోగదారులు ఈ కాల పరిమితిని ఇంకా పెంచమని సమంజసమైన కారణం చూపితే వారికి మరో 90 రోజుల పాటు సేల్ ఆర్డర్(Sale Order) కాల పరిమితిని పెంచే వెసులుబాటును కలిగిస్తున్నామన్నారు. ఈ సౌకర్యం కోల్ ఇండియాలో లేదని తెలిపారు.
ఎవరైనా ఈ-వేలం వినియోదారుడు బొగ్గు తీసుకుంటున్న క్రమంలో సేల్ ఆర్డర్‌ను రద్దు చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తే , రద్దు ప్రక్రియకు అంగీకరించటమే కాక వెంటనే సంబంధిత బొగ్గు డిపాజిట్ ను వెనక్కి చెల్లిస్తామని వెల్లడించారు.
సింగరేణి బొగ్గుని వినియోగిస్తున్న సుమారు 80 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. సమావేశంలో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ జి.దేవేందర్, అడిషనల్ జనరల్ మేనేజర్ ఎన్.వి. రాజశేఖర్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రవివాస్తవ తదితరులు పాల్గొన్నారు.