తెలుగు యూనివర్సిటీ, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ‘ప్రాజెక్టు కేసీఆర్’ కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ కళలు , సాహిత్యం, చరిత్ర, సంసృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తాము ఇప్పటికే 40 వేల పుస్తకాలను సేకరించామని, ఎవరి దగ్గరైనా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, వివరాలు ఉంటే తమకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘కేసీఆర్ అంటే కళాకారులు, చరిత్రకారులు, రచయితలు’ అని.. అందుకే ఈ కార్యక్రమానికి ‘ప్రాజెక్ట్ కేసీఆర్’గా నామకరణం చేసినట్టు చెప్పారు. సాహిత్య సదస్సులతో తెలంగాణ సాహితీ వైభవం కండ్ల ముందు ఆవిష్కృతమైనదని పేర్కొన్నారు. రెండురోజులపాటు తెలంగాణ సాహిత్యంమీద గంభీరమైన చర్చ జరిగిందని తెలిపారు. భారత జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో రెండు రోజులపాటు కొనసాగిన తెలంగాణ సాహిత్య సభలు గురువారంతో ముగిసాయి. ఈ సదస్సులో కవిత మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్యంతోపాటు భారతీయ సాహిత్యంపైనా విశ్లేషణాత్మక సదస్సులను నిర్వహించేలా భారత జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ‘తెలంగాణ అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు.. అమరులను పూజించే సంస్కృతి’ అని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని, ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించుకొంటున్నామని చెప్పారు.
కొన్ని పత్రికలు సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాలనే నేడు పాటిస్తున్నాయని, ప్రతిరోజూ.. ప్రతిక్షణం విషం చిమ్ముతూనే ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావని చురకలంటించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న పత్రికల మనసు మారాలని తాను కోరుకొంటున్నట్టు చెప్పారు. మనది పేద రాష్ట్రం కాదని, గొప్ప మనసున్న రాష్ట్రమని, అమరులను తప్పకుండా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్యంమీద చర్చ జరుగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి ఏడాది నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండలస్థాయిలో సాహిత్య సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పిల్లల్లో భాషమీద మక్కువ పెరుగాలని ఆకాంక్షించారు. తాము బాలసాహిత్యం ప్రచురించి, స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టుకోసం ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ చరిత్రను దేశవ్యాప్తం చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో బౌద్ధం, జైనం మీదకూడా బుక్స్ తీసుకొస్తామని తెలిపారు. సాహిత్య సదస్సులను విజయవంతం చేసిన సాహితీవేత్తలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమాన్ని పాట ఉర్రూతలూగించిందని శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ఉద్యమంలో పాటతోనే ప్రజా చైతన్యం వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలను చైతన్యం చేసిన పాట నేపథ్యాన్ని ఆయన వివరించారు. తెలంగాణ నేపథ్యంతో కవులు, కళాకారులు స్పృశించిన ఆలోచింపజేసే పలు పాటలను ఆలపించారు. తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి ప్రముఖ సాహితీవేత్త జితేంద్రబాబు వివరించారు. తెలంగాణ సాహిత్యంలో జరుగుతున్న మార్పులపై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు జాగృతి చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. భారత జాగృతి ఆధ్వర్యంలో తంగేడు పత్రిక ప్రజలను చైతన్యం చేస్తున్నదని గౌరీశంకర్ ప్రశంసించారు. తెలంగాణ సాహిత్య సభల సందర్భంగా 45 మంది కవులు, కవయిత్రులు సమర్పించిన ‘పరిశోధక పత్రాల సమాహారం- తెలంగాణ సాహిత్య అవలోకనం’ గ్రంథాన్ని ఈ సందర్భంగా వేదికపై వక్తలు ఆవిష్కరించారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి సదస్సులను సమన్వయం చేశారు.
తెలంగాణ సాహిత్యం ఎంతో గొప్పదని సాహితీవేత్తలు పేర్కొన్నారు. రెండోరోజు సదస్సులో తెలంగాణ ‘కవయిత్రుల కవిత్వంలో స్త్రీ అస్తిత్వం’ అంశంపై అనిశెట్టి రజిత, ‘తెలంగాణ రేడియో నాటక వికాసం’పై ఘనపురం దేవేందర్, ‘భాష-నిఘంటువులు’ అంశంపై డాక్టర్ నలిమెల భాస్కర్, ‘తెలంగాణ శాసన భాష పరిణామం’ అంశంపై శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడారు. ‘తెలంగాణ భాషపై ద్రవిడ భాషల ప్రభావం’పై డాక్టర్ సూర్య ధనుంజయ, ‘తెలంగాణ భాషపై ఉర్దూ, పారసీ భాషల ప్రభావం’ అనే అంశంపై డాక్టర్ కే లావణ్య, ‘స్వరాష్ట్రంలో నాటకం’పై డాక్టర్ మల్లేశ్ బలాష్ట్, ‘తెలంగాణ భాష చరిత్ర రచన-కొన్ని ఆలోచనలు’ అనే అంశంపై ఎం నారాయణశర్మ, తెలంగాణ గేయ కవిత్వంపై డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు, తెలంగాణ నవలా సాహిత్యంపై డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ‘తెలంగాణలో అవధాన వికాసం’ అనే అంశంపై అవుసుల భానుప్రకాశ్ ప్రసంగించారు.