Rajagopalan | హైదరాబాద్, అక్టోబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, సీఎం కేసీఆర్ మరోసారి బంపర్ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించబోతున్నారని ఢిల్లీకి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆర్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ టీవీ చానెల్ టౌమ్స్నౌలో గురువారం రాత్రి సీనియర్ జర్నలిస్ట్ పద్మజ తెలంగాణ ఎన్నికలపై చర్చా గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాలన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తిరిగి ఎందుకు విజయం సాధిస్తుందో విశ్లేషించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ వారసత్వ రాజకీయాలపై మాట్లాడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సీఎంలుగా ఉన్నవారు వారసులు కాదా అని ప్రశ్నించారు. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామి కాదా? అని అడిగారు.
తమిళనాడులో స్టాలిన్, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారు కాదా? రాహుల్‌గాంధీకి ఆ విషయం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. దక్షిణాదిలో అధికారంలోకి రావాలన్న బీజేపీ కలలు ఫలించబోవని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలో రావడం మాట అటుంచి ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను తగ్గించుకోవటంపై శ్రద్ధ పెడితే బాగుంటుందని చురక అంటించారు. బండి సంజయ్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా తొలిగించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా ఎందుకు నియమించాల్సి వచ్చిందో బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు. ఈసారి ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ విజయం తథ్యమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని రాజగోపాలన్ స్పష్టం చేశారు.