DGP Jiender | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నూతన డీజీపీ జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా రవిగుప్తాను నియమించింది. నాటినుంచి డీజీపీగా రవిగుప్తా కొనసాగగా, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను బదిలీచేసి డీజీపీగా జితేందర్‌ను నియమించారు.
సాధారణ రైతు కుటుంబం నుంచి..
పంజాబ్ జలంధర్‌లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్.. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. శిక్షణ తర్వాత ఏపీ క్యాడర్‌కు ఎంపికైన జితేందర్.. తొలి పోస్టింగ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, నక్స ల్స్ ప్రభావిత మహబూబ్‌నగర్‌తోపాటు గుంటూరు ఎస్పీగా సమర్థంగా విధులు నిర్వర్తించారు. డిప్యూటేషన్‌పై ఢిల్లీ సీబీఐలో, 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం విశాఖపట్టణం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా, ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా కూడా పనిచేశారు.