హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు అస్తిత్వమే మూలధనమని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ ఎడిటర్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టాస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘జయశంకర్ సార్ వారసత్వం- నేటి తరం బాధ్యత’ పేరిట నిర్వహించిన జయంతి సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ రాజకీయంగా అధికారం కోల్పోతే సాధించుకోవచ్చునని, ఒక్కసారి సంస్కృతి, అస్తిత్వాన్ని కోల్పోతే దాని మూలాలను తిరిగి పొందడం సాధ్యం కాదని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పోరాటాలకు వ్యత్యాసం ఉన్నదని అభిప్రాయపడ్డారు. పన్నెండేండ్లుగా దేశంలో బలమైన నాయకుడిగా కొనసాగుతున్న ప్రధాని మోదీని జంతర్‌మంతర్ వద్ద నిరసనలతో యువత కేవలం మూడు నెలల్లోనే సవాల్ చేసిందని గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల అన్యాయాలను లెకలతో సహా జయశంకర్ బయటపెట్టారని, 1952 ములీ ‘గో బ్యాక్’ ఉద్యమం నుంచి మలిదశ పోరాటం వరకు జయశంకర్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ భావజాలం ఎప్పటికీ చెరిగిపోదని, సవాళ్లను శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకొని ముందు కు సాగాలని పిలుపునిచ్చారు. సచివాలయం, మిషన్‌కాకతీయ, అమరవీరుల స్థూ పం, అంబేదర్ విగ్రహం వంటి నిర్మాణాలు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు.
‘బెల్టులతో కొట్టుడు.. లాగుల తొండలు ఇడుసుడు సంస్కృతా?’రాజకీయాల్లో ఇంతవరకూ చూడని దిగజారుడు భాషను ఇప్పుడు చూస్తున్నామని అల్లం నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. అభివృద్ధి, మార్పులను పకనబెట్టి, నిత్యం తిట్టుకునే స్థాయికి రాజకీయాలు దిగజారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏ ఆకాంక్షలు, మార్పుల కోసమైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో, నేడు ఆ ఆశయాలేవీ కనిపించడంలేదని వ్యాఖ్యానించారు.
ఆత్మగౌరవానికి చిహ్నాలుగా నిలిచే అంశాలకూ అవమానం జరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరేనని, సచివాలయం ముందు మరో విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి తెలంగాణను విధ్వంసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతం పేరిట హైదరాబాద్‌ను అడ్డికి పావుశేరు కింద అమ్మేశారని విమర్శించారు.
హైటెక్ సిటీ కట్టి తానే అంతా చేశానన్నట్టు మాట్లాడటం సరికాదని, అలాంటివి ఇప్పుడు 36 ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలో తెలంగాణ పాట, మాటకు విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్మించిన సచివాలయం, అమరవీరుల స్మారక స్థూపం, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చార్మినార్ తర్వాత అసలైన గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు.
రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి, కృష్ణా-గోదావరి నదీ జలాల్లో మన వాటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ‘స్వరాష్ట్రంలో స్వయంపాలన’ పుస్తకాన్ని ఆవిషరించారు. టాస్ అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ రవీందర్‌యాదవ్, సీనియర్ జర్నలిస్టులు పీ వేణుగోపాలస్వామి, గురువారెడ్డి, ఎర్రోజు రమణ, చందనం శ్రీకాంత్, ఆసరి రాజు, పులి రాజు, రూబీ స్టీఫెన్సన్, న్యాయవాది జీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.