హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వన్‌మ్యాన్ షోపై ఆగ్రహంగా ఉన్న పార్టీ సీనియర్లు అవకాశం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే కీసరలో రెండు రోజుల పాటు జరిగిన చింతన్ శిబిర్ (నవ సంకల్ప సదస్సు) వేదికగా రేవంత్‌పై పార్టీ సీనియర్లు పరోక్షంగా విరుచుకుపడ్డారు. రేవంత్ టార్గెట్‌గా బాహాటంగానే విమర్శలు చేయడం గమనార్హం. ఆయన చేస్తున్న ఆగడాలు, వ్యాఖ్యలను ఖండించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహేశ్వర్‌రెడ్డి, రేణుకా చౌదరి వంటి వారు రేవంత్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
రేవంత్ లేకుండా చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఓ సీనియర్ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి లేకున్నా వ్యవస్థ ఆగదంటూ చురకలంటించారు. ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ సమావేశాలు జరుగుతాయంటూ స్పష్టం చేశారు. మరో సీనియర్ నేత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు, మతాలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కానీ కొంత మంది నేతలు మాత్రం పార్టీని కొన్ని వర్గాలకే పరిమితం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం గురించి మాట్లాడే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవానికి ఈ సమావేశాలు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరగాలి. కానీ సీనియర్లు.. రేవంత్‌రెడ్డి లేకపోయినా… సమావేశాలు నిర్వహించాల్సిందేననని పట్టుబట్టినట్టు తెలిసింది. దీంతో పార్టీ అధిష్ఠానం తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం.
డీసీసీ అధ్యక్షుల అసంతృప్తి
పార్టీ కార్యకలాపాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని జిల్లా అధ్యక్షులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రేవంత్‌రెడ్డి వర్గంలోని జిల్లా అధ్యక్షులకు మాత్రం పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి గిట్టని వాళ్లను డీసీసీ అధ్యక్షులుగా తొలగించే అవకాశం ఉందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చింతన్ శిబిర్‌లో కొందరు డీసీసీలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము నిలబడి.. పార్టీని బతికించామని, ఇప్పుడు తమను తొలగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే జరిగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.