హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, ఎవరో కావాలనే సృష్టించిన కల్పితమైన అంశమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆదివారం ఒక లేఖ విడుదల చేశారు. క్రమశిక్షణ కమిటీ ఈ విషయంపై వివరణ కోరడానికి ముందే, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్య లు తీసుకొనేందుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నానని తెలిపారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని, కుట్రదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలో బయటపెడుతామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు సోదరుడు లాంటి వాడని, ఆయనపై ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తమ మధ్య దూరం పెంచేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. 45 ఏండ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, పార్టీకి నష్టం జరిగే పని ప్రాణంపోయినా చేయనని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, వివరణ ఇచ్చారు.