హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ఏడాదిలోపు దానిని పునరుద్ధరించుకోకపోతే ఆ మధ్య కాలాన్ని అంతరంగా పరిగణించరాదని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ కాలాన్ని లైసెన్స్ ఉన్నట్టుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఏడాదిలోపు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోని అభ్యర్థులకు కూడా డ్రైవర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ పీ మాధవీదేవి తీర్పు చెప్పారు. గతంలో నిర్వహించిన రాత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్షలు, డ్రైవింగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని, ఎంపిక ప్రక్రియ చేపట్టాలని తీర్పులో పేరొన్నది. రాష్ట్ర విపత్తు విభాగం, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం 2022లో పోలీస్ నియామక బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది.
అభ్యర్థులకు రెండేండ్లు అంతకంటే ఎకువ కాలం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని షరతు విధించింది. అయితే, లైసెన్స్ రెన్యువల్లో జాప్యాన్ని అంతరంగా పరిగణించిన బోర్డు తమ దరఖాస్తులను తిరసరించిందని 16 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మోటర్ వాహన చట్టం ప్రకారం లైసెన్స్ గడువు ముగిసిన 30 రోజుల్లో రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉండేది. అయితే 2019లోని సవరణ చట్టం గడువు ముగిసిన ఏడాదిలోపు రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించింది. కాబట్టి ఈ మధ్యకాలంలో రెన్యువల్ చేసుకోని కాలాన్ని అంతరంగా పరిగణించకూడదన్న పిటిషనర్ వాదనను హైకోర్టు ఆమోదించింది. సయ్యద్ మెహబూబ్ వర్సెస్ న్యూఇండియా అస్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేసులో సుప్రీం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కూడా ఏడాదిలోపు లైసెన్స్ రెన్యువల్ చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది.