భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 22 : జెన్కో కన్వేయర్ బెల్ట్ పనుల కోసం తమ భూములన్నీ తీసుకోవాలని భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి అనుబంధ సీపెల్లి గ్రామ రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడిచెర్ల నుంచి జెన్కో వరకు వేస్తున్న కన్వేయర్ బెల్ట్ తమ గ్రామం లో ఉన్న 250 ఎకరాల భూమి నుంచి వెళ్తున్నదని, సర్వే అధికారులు కేవలం 2 ఎకరాల 20 గుంటల భూమిని మాత్రమే తీసుకొని, ఎకరానికి రూ.16.50 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామంటున్నారని తెలిపారు.
కన్వేయర్ బెల్ట్ వేస్తే వాతావరణ కాలుష్యం జరిగి పంటలు పండకుండా నష్టపోతామని, పూర్తిగా భూములు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని జెన్కో, రెవెన్యూ అధికారులను కోరారు. లేకపోతే సర్వే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.