Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): 2011-2024 గూగుల్ మ్యాప్‌లను పోలిస్తే భారీ నిర్మాణాలు పెరగడం ఒకవంతైతే.. హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ కుచించుకుపోయినట్టుగా స్పష్టమవుతున్నది. అంటే ఒక్కోచోట వందలాది టిప్పర్లతో భారీ ఎత్తున సాగరంలో మట్టిని నింపి దాని గొంతు నులిమే ప్రయత్నం చేశారనేది అర్థమవుతున్నది. కానీ, ఇప్పుడు నీటి నిల్వ
ఉన్న ప్రాంతాన్నే ఎఫ్టీఎల్గా భ్రమింపజేస్తూ తమ నిర్మాణాలకు ఎఫ్టీఎల్ దూరంగా ఉన్నదంటూ సదరు నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి ఒకడుగు ముందుకేసి ‘కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి! ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే కూల్చుకోండి!’ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. మరి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ గుట్టును గూగులమ్మ తల్లి రట్టు చేసింది. ఇదంతా ఒకెత్తయితే జలమండలి మెమో ప్రకారం అర కిలోమీటర్ ఉత్తర్వులు అలాగే ఉన్నాయి. పైపెచ్చు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన జీవో 168 కూడా ఇంకా అమల్లోనే ఉన్నది. ఇక సవాళ్లు, ప్రతి సవాళ్లకు తావెక్కడ? నిగ్గు తేల్చాల్సింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే! దాని కనుసన్నల్లో నడుస్తున్న హైడ్రానే!
హిమాయత్‌సాగర్ జలాశయానికి సంబంధించి 2011 గూగుల్ మ్యాప్ ఇది. 2011 ఫిబ్రవరిలో జలాశయంలో ఒడ్డు (17*2047.89N-లాంగిట్యూడ్, 78*2133.35E – లాటిట్యూడ్) వద్ద ఉన్నది. అది ఫిబ్రవరి కావడంతో వానకాలంలో ఎగువ నుంచి వరద వస్తే ఇంకా నీటి నిల్వ పెరిగి ఒడ్డు ముందుకు వస్తుంది. అంటే ఎఫ్టీఎల్ ఇంకా ముందుకు జరుగుతుంది. ఆ సమయంలో ఎఫ్టీఎల్కు కొంత దూరంలో నామమాత్రపు నిర్మాణాలు కనిపిస్తున్నాయి.
ఇదీ హిమాయత్‌సాగర్ జలాశయానికి సంబంధించి ఈ ఏడాది మార్చి గూగుల్ మ్యాప్. జలాశయం ఒడ్డు చాలా కుచించుకుపోయింది. 2011 ఫిబ్రవరిలో కనిపిస్తున్న దరి (లాంగిట్యూడ్, లాటిట్యూడ్)ని మార్క్ చేస్తే సరిగ్గా మ్యాప్‌లో కనిపిస్తున్న నిర్మాణాల దగ్గరకు వచ్చింది. అంటే 2011లో అక్కడి వరకు జలాశయంలో నీళ్లున్నాయన్న మాట! దాని ప్రకారం జలాశయం పూర్తిస్థాయి నిల్వకు చేరుకుంటే నీళ్లు ఇంకా ముందుకు నిర్మాణాలను దాటి పోతాయి.
అంటే కచ్చితంగా ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ లోపలో, అంచునో ఉన్నాయనేది గూగులమ్మ విప్పిన గుట్టు! ఇక బఫర్‌జోన్ అంటారా?.. అందులో సందేహమే లేదు. ఇంతకీ ఆ నిర్మాణాలు ఎవరివో తెలుసు కదా! సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన గృహాలు.
ఇది కూడా 2011, ఫిబ్రవరిలో హిమాయత్‌సాగర్ జలాశయానికి సంబంధించిన మ్యాప్. ఇందులో అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు జలాశయం చెంతన కొలువుదీరారు. గెస్ట్‌హౌస్‌కు అనంతం అని నామకరణం కూడా చేసుకున్నారు. దాని పక్కనే అనన్య పేరిట మరో గెస్ట్‌హౌస్ కూడా కనిపిస్తుంది. అది కూడా ఒక రాజకీయ ప్రముఖుడిదేనన్న ప్రచారం ఉన్నది. అప్పట్లో కేవలం రెండు గెస్ట్‌హౌస్‌ల్లో ఒకటి చొప్పున నిర్మాణం ఉన్నది. జలాశయం ఎఫ్టీఎల్ కూడా దూరంగా కనిపిస్తుంది.
ఇది ఈ ఏడాది మార్చిలో అనంతం, అనన్య గెస్ట్‌హౌస్‌లకు సంబంధించిన గూగుల్ మ్యాప్. రెండు చోట్లా భారీ నిర్మాణాలు పెరిగిపోయాయి. నివాస సముదాయాలతో పాటు గార్డెనింగ్ కోసం చేపట్టిన పనుల్లో పెద్ద ఎత్తున కాంక్రీట్ పనులు కూడా చేశారు. మరోవైపు హిమాయత్‌సాగర్ జలాశయం ఈ నిర్మాణాలకు వణికి వెనక్కి పోయింది. ఈ రెండు మ్యాప్‌లు కూడా జలాశయానికి వరదలేని సమయాల్లో (అన్‌సీజన్) తీసుకున్నవి. పూర్తిస్థాయి నీటి నిల్వ సమయంలో కచ్చితంగా దరి ఇంకా ముందుకు ఉంటుంది. ఇవీ.. హిమాయత్‌సాగర్ నోట్లో మట్టి కొట్టిన తీరు!