Harish Rao | సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఖండించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రైతులు, స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి నుంచి ఎందుకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు? మండిపడ్డారు.
గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారనగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణ సృష్టించారని.. ఎందుకు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు, ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కే లేదా? ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చి, అప్రజాస్వామీక విధానాలు అనుసరించడం మీకే చెల్లింది అంటూ విమర్శించారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.