Revanth reddy | హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): ఇప్పటికే కుంపట్ల కుతకుతతో ఉడికిపోతున్న కాంగ్రెస్లో మరో కొత్త కుంపటి మొదలైందా? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఆయనకు పోటీగా మరో నేతను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై ఇటీవల మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి పార్టీలో కొందరి నేతల స్థానానికి ముప్పు ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు ఇక్కడి నేతలపై పార్టీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇస్తూ వారందర్నీ అధిష్ఠానానికి దూరం చేసేలా రేవంత్ కుట్రలు చేస్తున్నారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు పోటీగా అధిష్ఠానం వద్ద తమ గ్రూప్ నుంచి ఒక నేతను ప్రొజెక్ట్ చేయాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో తమ నేతను ప్రొజెక్ట్ చేయడం ద్వారా రేవంత్రెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే పలువురు కీలక నేతలు రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతను ముందుంచాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇలా చేస్తే తప్ప రేవంత్రెడ్డి దారిలోకి రారని, లేదంటే ఆయనను కట్టడి చేయడం కష్టమని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ నేతలంతా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.