కొల్లాపూర్/రాయికోడ్/ నారాయణరావుపేట/ జహీరాబాద్/ జనగామ/ రంగారెడ్డి, డిసెంబర్ 14 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన చస్మొద్దీన్ 1,736 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 12 వార్డులో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. గ్రామంలో 3,309 ఓట్లు ఉండగా 2,702 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 2,114, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శెట్టి నర్సింహులుకు 378 ఓట్లు పోల్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుందిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల స్వప్న హరీశ్ 1131 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 2053 ఓట్లు పోలుకాగా, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కొల్లూరి రేణుకామల్లేశంకు 433, మేర లావణ్యకు 22, కొండ వీరబత్తిని మౌనికకు 12 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బాలమోల రాధాతుకారాం జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 1349 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
రాయికోడ్ జీపీలో 10 వార్డులు ఉండగా, మొత్తం స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. రాయికోడ్‌లో అత్యధిక మెజారిటీతో గెలిచిన రాధాతుకారాంను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అభినందించారు. రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లో 178 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 13గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమకయ్యారు. 165గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ బలపర్చిన 75 మంది గెలుపొందగా, కాంగ్రెస్ 70 గ్రామాల్లో, 9 గ్రామాల్లో బీజేపీ, స్వతంత్రులు 10 మంది గెలుపొందారు.
జనగామ జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. జనగామ, బచ్చన్నపేట, నర్మె ట, తరిగొప్పుల మండలాల్లోని మెజారిటీ గా మ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగురవేయగా.. కొన్ని గ్రామాల్లో అధికార కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్కు 3, కాంగ్రెస్‌కు 3 చొప్పున సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 73 గ్రామపంచాయతీ స్థానాల్లో బీఆర్ఎస్ 39, కాంగ్రెస్ 27, బీజేపీ 4, స్వతంత్రులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి రికార్డ్ విజయాన్ని అందుకున్నది. గులాబీ పార్టీ మద్దతుదారురాలిగా చిట్టెమ్మ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవగా.. ప్రత్యర్థిపై 1572 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది.