హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది భర్తీపై అటు ప్రభుత్వం, ఇటు ఉన్నత విద్యామండలి ఎటూ తేల్చకోలేకపోతున్నాయి. ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఓసారి కాలేజీ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యోచించగా, తాజాగా ఉన్నత విద్యామండలి వైస్ చాన్సలర్లతో త్రిసభ్య కమిటీని వేసింది.
దీంతో వర్సిటీల్లో బోధనా సిబ్బంది భర్తీ కథ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వైస్ చాన్స్లర్లతో (వీసీ) నిర్వహించిన సమీక్షలో త్రిసభ్య కమిటీని నియమించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన వేసిన ఈ కమిటీలో ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ సభ్యులుగా ఉన్నారు.
రిక్రూట్మెంట్, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం, పదోన్నతులు, యూజీసీ నిబంధనలు, జీవో-15 ప్రకారం బోధనా సిబ్బంది నియామకంపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. మౌలిక వసతుల కల్పనకు వర్సిటీలు ఎంపీ ల్యాడ్స్, కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్సార్) నిధుల కోసం ప్రయత్నించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ వీసీలకు సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా వర్సిటీ యాక్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ వెల్లడించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వర్సిటీల వీసీలు నిత్యానందరావు, యాదగిరిరావు, ఉమేశ్, శ్రీనివాస్, సూ ర్యాధనుంజయ్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.