కరీంనగర్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కోనరావుపేట: పురిటిగడ్డకు మేలు చేయడానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చల్మెడ వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ముందుకు వచ్చారు. సొంతూరైన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో రూ.1.50 కోట్లతో ‘చల్మెడ జానకీదేవి’ పేరిట పాఠశాలను నిర్మిం చారు.
డిజిటల్ బోధనకు ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, డెస్క్ బెంచీలు, ఫర్నిచర్, క్రీడాసామగ్రి, మూత్రశాలలు, మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక వంటగది, విద్యుత్తు సదుపాయాన్ని కల్పించారు. విద్యార్థులను ఆకట్టుకొనేలా తరగతి గదులు, వరండాలో రంగుల చిత్రాలను వేయించారు. శుక్రవారం మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ హాజరుకానున్నారు.