నల్లగొండ సిటీ ఆగస్టు 19: నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ సూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను హతమార్చింది ఇద్దరూ పదో తరగతి విద్యార్థులేనన్న సంచలన విషయాలు బయటపెట్టారు. హత్యకు ముందు రూపారెడ్డి ‘బాబూ..’ అన్న ఒక్క మాటే ఈ కేసులో కీలక అధారమైందని తేలింది. పాఠాలు బోధించే టీచర్‌పై ఆ విద్యార్థులు కక్ష పెంచుకొని, డబ్బు కోసం పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్టు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నివాసముండే కల్లు రూపారెడ్డి ఈనెల 11వ తేదీన రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్వాడ్, సీసీ కెమెరా పుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలు, పాత నేరస్తుల వివరాలు, అనుమానితుల కదలికలు, రౌడీషీటర్ల వెరిఫికేషన్ తదితర అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాల ద్వారా పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70 సీసీ కెమెరాల పుటేజీలను విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్, ఐటీ బృందాలతో కలిపి మొత్తం 5 ప్రత్యేక బృందాలతో సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బంది 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. ప్రిన్సిపాల్ మృతికి సంతాపంగా వారం రోజులు స్కూల్‌కు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులను విచారించే విషయంలో కొంత జాప్యం జరిగింది. పాఠశాల పునప్రారంభమైన వెంటనే పోలీసులు.. విద్యార్థులను సున్నితంగా విచారించడంతో రెండు రోజులుగా స్కూల్‌కు రాని కొంత మంది విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. జల్సాలకు అలవాటు పడిన కొందరు విద్యార్థుల కదలికలను పరిశీలించగా సీసీ పుటేజీలో లభించిన ఆధారాలు ఓ ఇద్దరు విద్యార్థులపై అనుమానాలను పెంచాయి.
నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఉదయం 11.30 గంటలకు పెండ్లిపాకల ఎక్స్‌రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దోనియాల ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. వారి వద్ద రూ.1.54 లక్షల నగదు లభించింది. వీటిలో మూడు రూ.500 నోట్లకు రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించడంతో రూపారెడ్డిని హత్యచేసి ఆమె వద్ద ఉన్న నగదును అపహరించినట్టు ఆ విద్యార్థులు తెలిపారని పోలీసులు చెప్పారు.
హత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులూ ఒకే హాస్టల్ గదిలో ఉంటూ వ్యసనాలకు అలవాటు పడి సోషల్ మీడియా, యూట్యూబ్‌లో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించేవారు. గత నెలలో హాస్టల్లో డబ్బుతో పట్టుబడిన సందర్భంగా వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్ రూపారెడ్డి మందలించారు. ప్రిన్సిపాల్‌పై కక్ష పెంచుకొన్న వారు ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందనే ఉద్దేశంతో హత్యచేసి, ఆధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో సోషల్ మీడియాలో వెతికి ప్రణాళిక రచించినట్టు పోలీసులు తెలిపారు.
హత్యకు ముందు సదరు విద్యార్థులు వారంపాటు రూపారెడ్డి కదలికలను గమనించినట్టు పోలీసులు తెలిపారు. పథకంలో భాగంగా కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. హత్య జరిగిన రోజు సాయంత్రం రూపారెడ్డి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత బ్యాగులో నుంచి ఎరుపు రంగు హుండీ, ప్యాంట్ తీసుకొని వచ్చారు. ఇద్దరూ రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారని, ఒకరు బయట కాపలా ఉండగా, మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లారు. వంట గదిలో నుంచి ఇంట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేశారు. బెడ్రూమ్లో ఉన్న రూ.2.50 లక్షలు తీసుకొని ఇంటివెనుక గోడదూకి పారి పోయా రు. హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, సెల్‌ఫోన్ చెట్ల పొదల్లో పడేసి, కొంతదూరం వెళ్లిన తర్వాత దుస్తులు మార్చుకున్నారని పేర్కొన్నారు. ఎరుపు రంగు హుండీని డ్రైనేజీలో పడేసినట్టు తెలిపారు. హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా, చివరగా ‘బాబూ..’ అని పిలిచారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించే విషయంలో ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ ఎమ్వీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్, జితేందర్‌రెడ్డి, మల్లేపల్లి, చింతపల్లి, గుడిపల్లి, గుర్రంపోడు, సీసీఎస్ ఎస్సైలు రమేశ్, రామ్మూర్తి, నరసింహులు, వెంకన్న, సురేశ్, హెడ్ కానిస్టేబుళ్లు కరుణాకర్, విష్ణువర్ధనగిరి, వహీద్ పాషా, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, ప్రసాద్‌రావు, ఫయాజ్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు హేమూనాయక్, గులాం దస్తగిరి, సాయికుమార్, శివరాజ్, జునైద్ అహ్మద్, నరేశ్, సాయి, కమల్ కిషోర్, వేణుగోపాల్‌రెడ్డి, భాసర్, శరణ్‌రెడ్డి, నాగరాజు, అనిల్, శేఖర్‌ను ఎస్పీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.