హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల్లోని తరగతి గదులను వాచ్మెన్, సెక్యూరిటీ సిబ్బంది లేదా వారి కుటుంబ సభ్యుల వసతి కోసం, నివాసానికి వినియోగించొద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. సోమవారం అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించగా, వాచ్మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది వారి కుటుంబంతో సహా పాఠశాలలో నివసించేందుకు హెచ్ఎంలు అనుమతించినట్టు అధికారులు గుర్తించారు.
తరగతి గదులను బోధనా అభ్యసన కార్యక్రమాలు, విద్యాసంబంధిత అవసరాలకే వాడాలి. కానీ ఇతరత్ర అవసరాలకు వాడుతుండటాన్ని సీరియస్గా తీసుకున్నది. తరగతి గదులను విద్యా అవసరాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టంచేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వాటిని అనుమతి ఇవ్వొద్దని సూచించారు.