హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : మరణించిన పోలీస్ సి బ్బంది పిల్లలకు ‘పరివర్తన’ పేరిట హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్కాలర్షిప్లు అం దించడం అభినందనీయమని పోలీసు వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డీజీ (ఇన్చార్జి), పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో చనిపోయిన పోలీస్ సిబ్బంది పిల్లల్లో 58 మందికి స్కాలర్‌షిప్‌ల కింద రూ.14.87లక్షల చెక్కును ఆమె అందజేశారు. మూడేండ్లుగా 151 మందికి పరివర్తన్ సాలర్షిప్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందజేస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.3.75 కోట్లను అందజేసిందని వివరించారు. హెచ్డీఎఫ్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భాటియా, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రావు, వెల్ఫేర్ లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.