హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్వత్సభ విస్తృతంగా చర్చించి తీసుకొన్న నిర్ణయం మేరకు ఈ నెల 13నే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని పండితులు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 వ తేదీన సద్దుల బతుకమ్మ అని ఖరారు చేసింది. కొందరు సిద్ధాంతులు మాత్రం బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా శాస్ర్తాలలో ఎక్కడా పేర్కొన్నందున కచ్చితంగా తేదీలు చెప్పలేమని అంటున్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకునే సంప్రదాయం ఉన్నదన్నారు.
బతుకమ్మను వేములవాడలో 7 రోజులు, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల 13 రోజులు అడతారు. ఎక్కువమంది పండితుల అభిప్రాయం ప్రకారం 13న సద్దుల బతుకమ్మ జరుపుకోవాలి. –కమలాకర సిద్ధాంతి, కూకట్పల్లి
బతుకమ్మ పితృ అమావాస్యరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై ఆయా ప్రాంతాల్లో స్థానిక ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం 5, 7, 9 రోజులు జరుపుకొంటారు. 13న సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని విద్వత్సభ ఇప్పటికే నిర్ణయించింది.
-అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి, వరంగల్ భద్రకాళి దేవస్థానం సిద్ధాంతి
బతుకమ్మ పండుగ ఈ నెల 6 ప్రారంభమైంది. 14న సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది. తేదీ విషయంలో ఎలాంటి సందేహం లేదు. -గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు
యాదాద్రి దేవస్థానం సిద్ధాంతి కృష్ణమాచార్య పంచాంగం ప్రకారం అక్టోబర్ 14 న సద్దుల బతుకమ్మ, 15న దసరా జరుపుకోవాలి. -గంగు ఆంజనేయశర్మ, జనగామ జిల్లా బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు
విద్వత్ సభలో దుర్గాష్టమిరోజున జరుపుకోవాలని నిర్ణయించినప్పటికీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉన్నందున దీనికి స్పష్టంగా ఫలానా రోజే జరుపుకోవాలని చెప్పలేం. స్థానిక సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడమే ఉత్తమం.
–దివ్యజ్ఞాన సిద్ధాంతి, మేడిపల్లి