హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ప్రీ లాంచ్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న రూ.300 కోట్ల మోసం మరువక ముందే తాజాగా మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచింగ్ స్కీమ్ పేరుతో దాదాపు 200 మంది నుంచి రూ.48 కోట్లు వసూలు చేసి పత్తాలేకుండా పోయిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన చక్క భాస్కర్ ‘ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి భార్య సుధారాణి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ అమాయక ప్రజల నుంచి పెద్ద ఎత్తు డబ్బులు వసూలు చేయాలనే లక్ష్యంతో ప్రీ లాంచింగ్‌ను ప్రాంరభించారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, సరైన పత్రాలు లేకుండానే ఘట్కేసర్లోని యమ్నంపేట్ గ్రామంలో బ్లిస్ హైట్స్ ప్రాజెక్ట్, పటాన్చెరు, కడ్దనూర్ గ్రామంలో ఓఆర్ఆర్ ప్రాజెక్ట్, సంగారెడ్డిలోని మురిగి గ్రామంలో 2020-2021 మధ్య కాలంలో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్‌ను ప్రారంభించారు.
మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇస్తామని, మూడేండ్లలోపు ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి ఫ్లాట్లను అప్పగిస్తామని నమ్మబలికారు. అంతే కాకుండా మూడేండ్లలోపు పూర్తిచేయలేని సందర్భంలో 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.6000, 3బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.8000 చొప్పున అద్దె చెల్లిస్తామని హామీలు గుప్పించారు. మీడియా, సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేసి, సెలబ్రిటీలతో ప్రకటనలు చేయించి జనాలను ఆకర్శించారు. ఇది నమ్మిన దాదాపు 200 మంది పెద్దఎత్తున పెట్టుబడి పెట్టారు. మూడేండ్లు గడిచినా ఎలాంటి ఫ్లాట్లను నిర్మించకపోగా, ఇచ్చిన డబ్బుల విషయమై ప్రశ్నించేందుకు యత్నించగా నిందితులు నగరం నుంచి పారిపోయారు. దీంతో నగరానికి చెందిన మనోజ్‌కుమార్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం చక్క భాస్కర్, సుధారాణి దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు డీసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో ఏసీపీ సోమనారాయణ్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.