హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సాక్షి టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 356(2) సెక్షన్లను తొలగిస్తూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో ఓసారి చెప్పినా మళ్లీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్పీకి, ఎస్పీకి మెమో జారీ చేశారు.
కొమ్మినేని శ్రీనివాసరావు.. అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ ఏపీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం ఆయనను హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొమ్మినేని పోలీసులు మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపికి ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పిశాచాలు ఇలా చేయరేమో? వారిని రాక్షసులు అని కూడా అనలేం. అందరూ సంకరం అయ్యారు. ఇవన్నీ కలిసి తెగ ఉన్నట్టుంది. నిరసనలన్నీ సహజమైనవని కావు.. వ్యవస్థీకృతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలే’ అని సజ్జల వ్యాఖ్యానించారు.