హైదరాబాద్ మే 13 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకులాల్లోని ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సిందేనని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టంచేశారు. సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్ గురుకులాల్లో కో ఎడ్యుకేషన్తో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఈ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మంగళవారం ఎస్సీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆఫీసులో ఆమె విలేకరులతో మాట్లాడారు.
జూన్ 3 నుంచి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ కోసం మానకొండూర్ నియోజకవర్గంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించామని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో 57,523 సీట్ల భర్తీకి 1,69,171 దరఖాస్తులు వచ్చాయని, 55,504 సీట్లను రెండు విడతల్లో భర్తీ చేశామని తెలిపారు. మిగిలిన 2019 సీట్ల భర్తీకి మే 20న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 10లోగా రిపోర్ట్ చేయాలని సూచించారు.