హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: క్రాంతిజ్యోతి సావిత్రీబాయిఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సావిత్రీబాయి సేవలు భవిష్యత్తు తరాలకు తెలిసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సావిత్రీబాయిఫూలే ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు మణిమంజరి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సావిత్రీబాయిఫూలే 192వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆవరణలో జ్యోతిబాఫూలే దంపతుల విగ్రహాలతోపాటు వారి పేరుతో ఢిల్లీలో బీసీభవన్ను ఏర్పాటుచేయాలని కోరారు. జ్యోతిబాఫూలేకు భారతరత్న అవార్డు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. విద్యాభివృద్ధిలో ఫూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని కొనియాడారు. సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకొని బీసీ, ఎస్సీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. సావిత్రీబాయిఫూలే అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదిరించి, మహిళల హక్కుల కోసం పోరాడిన వీరవనిత అని కొనియాడారు. సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకొని సీఎం కేసీఆర్ 360 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారని చెప్పారు. నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌కు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు. జ్యోతిబాఫూలే దంపతుల పేరు మీద హైదరాబాద్‌లో స్మృతివనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేంద్రాచారి, శుభప్రద్‌పటేల్, పలువురు కార్పొరేటర్లు, బీసీమహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన 200 మంది మహిళలను సావిత్రీబాయిఫూలే అవార్డులతో సత్కరించారు.
ఆమె మొదటి క్రాంతిదర్శి: కూనంనేని
దేశంలో మహిళల చదువుల కోసం పరితపించిన మొదటి కాంత్రిదర్శి సావిత్రీబాయిఫూలే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొనియాడారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో మంగళవారం సావిత్రీబాయిఫూలే జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర బీసీ హకుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. మహిళల విద్యాభివృద్ధికి, హక్కుల సాధనకు సావిత్రీబాయి చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో బీసీ హకుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి ఆర్పీ రంగాచార్యులు, సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.