KTR | గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని చాలెంజ్ చేసిన మంత్రి పొంగులేటికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. మంత్రి తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయమై మంత్రి పొంగులేటి చాలెంజ్‌కు ప్రతి సవాలు విసిరారు. హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు.
సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని.. కేవలం శపథం చేయడం కాదని, చేతనైతే చేసి చూపించాలన్నారు. 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే ప్రజల గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతాం అన్న సవాల్‌కు పౌరుషం ఉంటే కట్టుబడి ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దమ్ముంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనాలని సవాల్ విసిరారు.
పేదల స్వగృహ స్వప్నాలను సాకారం చేశాం..
ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదని కేటీఆర్ ఉద్ఘాటించారు. స్వరాష్ట్రాన్ని సాధించామని, పేదల స్వగృహ స్వప్నాలను సాకారం చేశామన్నారు కేటీఆర్ . డబ్బా ఇండ్లు కాకుండా, డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామన్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఏకంగా లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన ఘనత తమదేనని కేటీఆర్ గుర్తుచేశారు. తాము 70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదని, తాము కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానమన్నారు. చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయని సాహసంతో, 60 ఏండ్లు ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిల్లను నిర్మించి చూపించామని తెలిపారు. మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టాలని సవాల్ చేశారు.
ఇండ్లు కట్టింది మేం.. బుల్డోజర్లతో కూలగొడుతున్నది మీరు!
గృహ నిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం తామైతే, గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు కాంగ్రెస్ నేతలని కేటీఆర్ మండిపడ్డారు. ఇటుకలు పేర్చి ఇండ్లు కట్టింది తామైతే, పేదల ఇండ్లమీద బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీకెండ్లో మంది కొంపలు కూల్చి వికృతానందం పొందుతున్న మీరు ఇండ్లు కట్టడం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి కదా అని ఎద్దేవా చేశారు. గత రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని? పడగొట్టిన ఇండ్లు ఎన్ని? అనే దానిపై శ్వేత పత్రం ప్రకటించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దీపావళికి బాంబులు పేలుస్తామని చెప్పి తుస్సు మనిపించిన ‘తుపేల్ మినిస్టర్’, ‘మిస్టర్ బాంబులేటి’ అంటూ పొంగులేటిపై కేటీఆర్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్ మాకు తెలియవు
తమకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం, ఆత్మాభిమానంతో బతకడం మాత్రమే తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. మీలాగా కోహినూరు హోటల్లో కాళ్లు పట్టుకొని, ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదన్నారు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు తమకు తెలియవన్నారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకొని భూభారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్, గూండాలను ఉసిగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను బుక్క పట్టడం తమకు తెలియవని స్పష్టం చేశారు. అలాగే, బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం కూడా తమకు తెలియదన్నారు.
ప్రభుత్వం ఎన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా.. 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టబోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టబోమని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.