న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రపంచవ్యాప్తంగా 2025లో 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. కేంద్ర విదేశాంగ శాఖ ఈ వివరాలను ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే ఈ ఏడాదంతా అమెరికాలో మారిన ఇమిగ్రేషన్ నిబంధనలు, వీసా ఉల్లంఘనలపై అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలు, అక్రమ వలసదారుల సామూహిక తరలింపు వంటి అంశాలు విస్తృతంగా చర్చకు రాగా అమెరికా నుంచి అత్యధికంగా భారతీయుల బహిష్కరణలు జరిగి ఉంటాయని ఎవరైనా భావిస్తే పొరబడినట్లే. భారతీయుల బహిష్కరణల జాబితాలో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 11,000 మంది భారతీయులను ఆ దేశం బహిష్కరించింది.
నివాస చట్టాల ఉల్లంఘనలు, వీసా గడువు తీరిన తర్వాత కూడా అక్రమంగా కొనసాగడం, ఇతర పర్మిట్ సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకుని వీరంతా సౌదీ నుంచి బహిష్కరణ వేటు ఎదుర్కొన్నారు. జెడ్డాలోని భారతీయ ఎంబసీ వద్ద ఉన్న వివరాల ప్రకారం 2025లో 7019 మంది భారతీయుల తరలింపు జరుగగా రియాద్‌లోని భారతీయ కాన్సులేట్ నుంచి అందిన వివరాల ప్రకారం మరో 3,865 మందిపై బహిష్కరణ వేటు పడింది. గల్ఫ్ దేశాల్లో భారతీయులు అత్యధికంగా పని చేస్తుంటారు. నిర్మాణ రంగం, హౌస్ కీపింగ్, ఇంటి పని వంటి వాటిల్లో భారతీయ వలస కార్మికులు అధికంగా పని చేస్తుంటారు. వీసా ఉల్లంఘనలు, పని సంబంధ సమస్యలు, స్థానిక చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో అనేకమంది వలస కార్మికులు గల్ఫ్ దేశాలలో చిక్కుల్లో పడుతున్నారు.
అమెరికాలోనూ పెరిగాయి
అమెరికా నుంచి ఈ సంవత్సరంలో దాదాపు 3,800 మంది భారతీయులు బహిష్కృతులయ్యారు. గడచిన 5 ఏండ్లలో ఈ ఏడాదే అత్యధికంగా భారతీయుల తరలింపు జరిగింది. హెచ్-1బీ సహా వర్క్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం నిఘా పెంచడంతో అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులు ఇంటి బాట పట్టక తప్పడం లేదు. వాషింగ్టన్ డీసీ నుంచే అత్యధికంగా 3414 మంది భారతీయుల తరలింపు జరిగింది. హూస్టన్ నుంచి 234 మంది బహిష్కృతులయ్యారు. బ్రిటన్‌లో ఈ సంవత్సరం 170 మంది భారతీయ విద్యార్థులపై బహిష్కరణ వేటు పడగా, ఆస్ట్రేలియా నుంచి 14 మంది, రష్యా నుంచి 82 మంది బహిష్కృతులయ్యారు.
అదే విధంగా మయన్మార్ నుంచి 1,591 మంది, మలేషియా నుంచి 1,485 మంది, యూఏఈ నుంచి 1,469 మంది, బహ్రెయిన్ నుంచి 764 మంది, థాయ్‌ల్యాండ్ నుంచి 481 మంది భారతీయులు బహిష్కృతులయ్యారు. అయితే ప్రధాని మోదీ దౌత్య వైఫల్యం కారణంగానే భారతీయులు విదేశాల నుంచి బహిష్కరణకు గురవుతున్నారని విపక్షాలు, మేధావులు విమర్శిస్తున్నారు. మన దేశ విదేశాంగ విధానం మరింత పటిష్ఠం అవ్వాలని వారు సూచించారు.