మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కూ యూరియా కష్టాలు తప్పలేదు. తనకున్న ఐదున్నర ఎకరాల పొలానికి అవసరమైన యూరియా కోసం సత్యవతి ఆదివారం గుండ్రాతిమడుగు సొసైటీ వద్ద మహిళా రైతులతో కలిసి లైన్లో నిలబడ్డారు. గంటపాటు వేచిఉన్న తర్వాత అధికారులు ఒక బస్తాకు కూపన్ ఇచ్చారు.
కురవి, సెప్టెంబర్ 14: యూరియా కష్టాలు సామాన్య రైతులకే కాదు మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కూ తప్పలేదు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని స్వగ్రామమైన పెద్దతండాలో సత్యవతిరాథోడ్‌కు ఐదున్నర ఎకరాల భూమి ఉండగా వివిధ పంటలు సాగు చేయిస్తున్నారు. నెలరోజులుగా యూరియా దొరకకపోవడంతో ఆదివారం మాజీ మంత్రి గుండ్రాతిమడుగు సొసైటీ వద్దకు వచ్చి కూపన్ కోసం మహిళా రైతులతో కలిసి లైన్లో నిలబడ్డారు. గంటపాటు వేచిఉన్న తర్వాత అధికారులు ఒక యూరియా బస్తాకు కూపన్ ఇచ్చారు. తర్వాత మరో లైన్ నిలబడి యూరియా బస్తాను తీసుకున్నారు. ఒక్క బస్తా కోసం రైతు పడే కష్టాన్ని స్వయంగా సత్యవతిరాథోడ్ అనుభవించారు.
చేతగాని ప్రభుత్వం వల్లే రైతులకు కష్టాలు: మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంవల్లనే రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. గుండ్రాతిమడుగు సొసైటీ ఎదుట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నెలరోజులుగా రైతులు నాట్లు, పనులను వదిలి క్యూలో నిలబడుతున్నారని పేర్కొన్నారు. పది ఎకరాలు ఉన్న రైతు ఒక్క బస్తా యూరియా ఏం చేసుకుంటారో ప్రజాప్రతినిధులు చెప్పాలని నిలదీశారు. రైతు కష్టాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రైతు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రానిదే తప్పు అంటూ తప్పించుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని యూరియా కర్మాగారాన్ని బాగుచేయించాలనే సోయి ప్రభుత్వానికి లేకపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 16 మందిని పార్లమెంట్‌కు పంపిస్తే ఒక్క రోజు కూడా రైతుల గురించి మాట్లాడిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల డిమాండ్ మేరకు యూరియాను దిగుమతి చేసుకోవాలని సూచించారు. రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం మనుగడలేదని గుర్తుచేశారు.