హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయిన మరుసటి రోజే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగింది. ఏకం గా 24 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యంత తక్కువగా మెదక్ జిల్లా సత్నాయిపల్లిలో 8.7 డిగ్రీల కని ష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నెల 23న రాత్రి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సోమవారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినట్టు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. సోమవారం రాత్రి 24 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, హైదరాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్ర మే 15.2 నుంచి 16.3 డిగ్రీల మధ్య సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. సిత్రాంగ్ తుఫాన్ సోమవారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని తింకోన, శాండ్విన్ మధ్య తీరం దాటినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావం తెలంగాణపై చూపలేదని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 వరకు పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది.