హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్థిక నేరాల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉప్పలపాటి సతీశ్ దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత నెలలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న సతీశ్‌ను ఈ నెల 20న కర్ణాటకలోని ధార్వాడ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించామని, శనివారం ఆయన భార్య శిల్ప బండ అలియాస్ ఉప్పలపాటి శిల్పను కూడా అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిద్దరినీ కోర్టులో హాజరుపర్చడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు తెలిపారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ కేసుల్లో నిందితులుగా ఉన్న సతీశ్ దంపతులు.. తమ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అనేకమందిని మోసగించారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వినయ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు రూ.23 కోట్ల మేరకు మోసపోయారు.