హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పంటల సాగు లెక్కను పక్కాగా నిర్వహించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు శాటిలైస్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. ‘గ్రౌండ్ ట్రూత్’ పేరుతో ఈ యాప్‌ను వినియోగింలోకి తీసుకొచ్చింది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన మండలాల్లో శాంపిల్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల్లో ఎంపిక చేసిన కొన్ని సర్వే నంబర్లలో ఈ సర్వే చేయనున్నారు. అక్కడి ఏఈవో ఆ పాయింట్ వద్దకు వెళ్లి దాని పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారనేదాన్ని మొబైల్ యాప్‌తో లెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్‌లో భాగంగా సర్వే నంబర్లవారీగా ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారనే వివరాలను ఏఈవోలు లెక్కిస్తున్నారు.
ఈ లెక్కలకు, యాప్ ద్వారా సేకరించే లెక్కలను పోల్చి చూసి సాగు విస్తీర్ణంపై అంచనాకు వస్తారు. గతేడాది వరిసాగు విస్తీర్ణం విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త అతి చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో వరి సాగును ఎక్కువ చేసి చూపుతున్నారని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ శాటిలైట్ సర్వే నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం అందించిన సాగు విస్తీర్ణం వివరాలకు, కేంద్ర సంస్థ శాటిలైట్ సర్వే లెక్కలు దాదాపుగా సరిపోయాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముందే గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రానికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నూతన విధానంలో పంటల సాగు విస్తీర్ణాన్ని లెక్కించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ యాసంగిలో 50.46 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ తెలిపింది.