హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సాట్(స్కోలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్) పరీక్ష… విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్ చదువుకోవడానికి ఎలిజిబిలిటీ టెస్ట్. చాలా కళాశాలలు అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా సాట్ పరీక్ష స్కోర్‌ను అడుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలని కలలు కన్న ఓ ఇంటర్ విద్యార్థిని ఆశలపై సెంటర్ నిర్వాహకులు నీళ్లు చల్లారు. నిబంధనల్లో లేని సాకు చూపి పరీక్షకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని పరీక్ష రాయలేదు. శనివారం హైదరాబాద్‌లోని కోకాపేటలో గల రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో సాట్ పరీక్ష నిర్వహించారు.
కొత్తపేటకు చెందిన విద్యార్థిని కే అమృషకు సరైన హాల్‌టికెట్ ఉన్నప్పటికీ ఒరిజినల్ ఆధార్‌కార్డ్ లామినేట్ చేసి ఉందంటూ పరీక్ష కేంద్రం నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు. ఎంతసేపు బతిమిలాడినా లోపలికి అనుమతించలేదు. కాలేజీ ఐడీ, తన దగ్గర ఉన్న ఇతర ఐడీ కార్డ్స్ చూపించినప్పటికీ పరీక్ష కేంద్రం ఇన్చార్జి కీర్తి తనను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదంటూ విద్యార్థిని ‘100’కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరీక్ష కేంద్రం వద్దకు వచ్చిన పోలీసులు ఏ ఆధారాలతో ఆమెను పరీక్ష రాయనీయడం లేదని, లామినేషన్ ఆధార్ కార్డ్‌ను అనుమతించవద్దంటూ రూల్స్‌లో ఎక్కడా లేదని, అడ్డుకోవడానికి సరైన కారణాలు చూపాలని పరీక్ష కేంద్రం నిర్వాహకులను నిలదీశారు.
అయినా నిర్వాహకులు తనతోపాటు వివిధ కారణాలతో 8 మందిని పరీక్షకు అనుమతించలేదని అమృష వాపోయింది. పరీక్షకు హాజరుకాకపోతే తాను విద్యాసంవత్సరం మొత్తం కోల్పోయినట్టేనని, 130 డాలర్లు పరీక్ష ఫీజు చెల్లించానని, తమ భవిష్యత్‌తో ఆటలు ఆడుకోవడం కరెక్టేనా..? అని ప్రశ్నించింది. తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో గళమెత్తింది. తనను పరీక్షకు అనుమతించని పరీక్ష కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేసింది.