ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వంద శాతం బీఈడీ పూర్తి చేసిన వారికే కేటాయించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఈడీ అభ్యర్థులు భూక్యా కుమార్, పాండు, అశోక్ చౌహాన్, కిరణ్‌కుమార్, ఎల్లన్నతో కలిసి మాట్లాడారు. అత్యున్నత న్యాయ స్థానం తీర్పు నేపథ్యంలో బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ రాసుకునే అవకాశాన్ని కోల్పోయారని వాపోయారు.
దీంతో డీఈడీ వారికే ఎస్జీటీ పోస్టులకు అవకాశం లభించిందని, అలాంటప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నింటినీ బీఈడీ వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు విద్యాశాఖలోని 26వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. జాతీయ నూతన విద్యావిధానం ఆధారంగా విద్యావ్యవస్థలో మార్పులు చేయాలని, ప్రైమరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలను వేర్వురుగా చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.