Jubilee Hills by Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఆ స్థాయిలోనే ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతోంది. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది. ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ గ్రూపు సర్వేలోనూ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఏఎస్ గ్రూప్ అధికారికంగా వెల్లడించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. ఎర్రగడ్డలో 760, షేక్‌పేటలో 780, యూసుఫ్‌గూడలో 520, వెంగళ్రావ్ నగర్లో 550, బోరబండలో 790, రహమత్ నగర్లో 780, శ్రీనగర్ కాలనీలో 510 శాంపిళ్లను సేకరించారు. అంటే మొత్తంగా 4690 శాంపిళ్లను సేకరించి అనాలిసిస్ చేశారు. ఈ శాంపిళ్లను ఓటర్లతో నేరుగా సమావేశమై సేకరించినట్లు సర్వే సంస్థ తెలిపింది.
ఇక మహిళా, పురుష ఓటర్లకు సమ ప్రాధాన్యం ఇచ్చామని, వారి వారి అభిప్రాయాలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఏజ్ గ్రూప్స్, జెండర్, కులం, మతం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, దినసరి కూలీలు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారి నుంచి అభిప్రాయాలను సేకరించి.. ఓటర్ల మనోగతాన్ని విశ్లేషించినట్లు పేర్కొంది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఓటర్లను ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించి అనాలిసిస్ చేసినట్లు తెలిపింది.
ఇక నవంబర్ 3వ తేదీ నాటికి సేకరించిన శాంపిళ్ల అనాలిసిస్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 4 శాతం ఓటు షేర్‌తో లీడింగ్‌లో ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే పోలింగ్ రోజు నాటికి ఎలాంటి పరిస్థితులైనా ప్రభావితం చేయొచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని పేర్కొంది. బీసీ, మైనార్టీ కమ్యూనిటీ ఓటర్లు ఈ ఉప ఎన్నికలో కీలకం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలినట్లు పేర్కొంది. గత ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడం.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సెటిలర్లలో చాలా మంది బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
